భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం బుధవారం 17 అడుగులకు చేరింది. ఈ నెల మొదటి వారం నుంచి ప్రవాహంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నీటిమట్టం మరో మూడు అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


