ఇసుక లారీలను
అడ్డుకున్న రైతులు..
ఇసుక లారీలతో ధ్వంసమవుతున్న సీతారామ కెనాల్ కట్ట
పగుళ్లు ఏర్పడిన చోట మట్టిని
కాల్వలోకి తోస్తున్న వైనం
పూర్తిగా ఛిద్రమైన కాల్వ రోడ్లు
అశ్వాపురం: మండలంలోని సీతారామ కాల్వ పూడుకుపోనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ రోడ్లపై లారీలు ఇష్టారాజ్యంగా వెళ్తుండటం.. ఆ రోడ్డు దెబ్బతింటుండటం.. మరమ్మతుల పేరుతో మిగులుతున్న మట్టి, రాళ్లను కాల్వ లోకి నెడుతుండటంతో కాల్వ కనమరుగుకానుందని వారు పేర్కొంటున్నారు. మండలంలో బట్టీలగుంపు, రాంనగర్ వద్ద అధికారికంగా గోదావరి ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇసుక లారీలు అమ్మగారిపల్లి నుంచి గొల్లగూడెం వరకు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పక్కన ఉన్న రహదారులపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల వర్షాలు పడుతుండటంతో సీతారామ కెనాల్ కట్ట బురదమయం కావడంతో పాటు ఇసుక లారీల బరువుకు పూర్తిగా ధ్వసంమవుతున్నాయి. అప్పుడప్పుడూ ఇసుక లారీ లు దిగబడుతున్నాయి. ముందుకు కదిలే పరిస్థితి ఉండటం లేదు. ఛిద్రమైన రహదారి భాగాలకు మరమ్మతులు చేసే క్రమంలో మిగులుతున్న బురద, మట్టి, రాళ్లను పక్కనే ఉన్న సీతారామ కాల్వలోకి అడ్డదిడ్డంగా నెడుతున్నారు. దీంతో కాల్వ క్రమంగా పూడుకుపోయే ప్రమాదం ఏర్పడుతోంది. మరోవైపు కాల్వపై పలుచోట్ల డీఎల్‌ఆర్‌బీలను కట్టారు. ఇవి కేవలం సాధారణ వాహనాలు, ప్రజలు ప్రధాన కాల్వను దాటేందుకు కట్టినవి. రహదారులు బురదమయం కావడంతో లారీలన్నీ వీటి పైనుంచి వెళ్తున్నాయి. రోజుకు వందలాది లారీలు వాటిపై వెళ్తుండటం, అంతేకాకుండా అవి అధిక బరువు ఉంటుండంతో డీఎల్‌ఆర్‌బీలకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కెనాల్‌లోకి నెడుతున్న మట్టి..
సీతారామ ప్రాజెక్టు కాల్వ కరకట్టలు భారీ యంత్రాలు, వాహనాల తాకిడితో ధ్వంసమవుతున్నాయి. తాత్కాలిక అనుమతులతో మొదలుపెట్టిన ఇసుక లారీల రవాణా వల్ల కెనాల్‌కు ఇరుపక్కలా పకడ్బందీగా నిర్మించిన కరకట్టలు ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ నిర్మాణాల విధ్వంసానికి కారకులెవరు? అనుమతులు ఇచ్చిన అధికారులెవ్వరు? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ కాల్వ కరకట్టలు ధ్వంసమై భారీ లోడుతో వెళ్తున్న లారీల టైర్లు మునిగే దాకా దిగబడుతున్నాయని, ఆ ప్రాంతంలో జేసీబీలు, భారీ యంత్రాల సాయంతో కెనాల్‌లోకి మట్టి, రాళ్లు నెట్టి పూడ్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అధికారులు నిత్యం పర్యవేక్షించటానికి నిర్మించిన రోడ్లపై లారీలు వెళ్లడంతో గుంతలమయంగా మారాయి. తమ కార్యాలయాల నుంచి ప్రాజెక్టు జీరో పాయింట్ వద్దకు చేరుకోలేని విధంగా ప్రస్తుతం ఆ రోడ్లు ధ్వంసమయ్యాయి. మరమ్మతులు చేసేందుకు కనీసం టూ వీలర్ కూడా అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. కాగా, ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలు తరలిస్తున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర సమస్య ఏర్పడితే మరమ్మతులు ఎలా చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్లను, కరకట్టను ధ్వంసం చేసిన వారిపై, ప్రాజెక్టు కెనాల్‌ను పూడ్చే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇసుక లారీల వల్ల రహదారులు, వంతెన, సీతారామ కెనాల్ కట్ట ధ్వంసమవుతోందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులే ఇసుక లారీలను అడ్డుకున్నారు. కరకట్టలను ఒక్కోచోట మీటర్ లోతు తవ్వి పైనఉన్న సిల్ట్ మొత్తాన్ని సీతారామ కెనాల్ వారిదే అన్నట్లు ప్రాజెక్టు కెనాల్‌లోకి నెడుతున్నారని ఇసుక రవాణాకు రాజమార్గాలు వేసుకుంటున్నారని, కెనాల్‌ను పూడ్చే అధికారం వారికి ఎవరిచ్చారని స్థానిక రైతులు అంటున్నారు. అధికారులు సీతారామ ప్రాజెక్టును కాపాడుతారో లేదా పూడ్చివేసే వారికి మద్దతు నిలుస్తారో తేల్చుకోవాలని వారి వల్ల కాని పక్షంలో ఈ ప్రాజెక్టుకు భూములు త్యాగం చేసిన తామే కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.


