భద్రాచలంటౌన్/భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో బుధవారం టాలీవుడ్ నటి రష్మీగౌతమ్ సందడి చేశారు. పట్టణంలోని కాసమ్ ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ నిర్వాహకులు టూరిజం హోటల్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించి మా ట్లాడారు. కాసం ఫ్యాషన్స్ సంబంధించి 30 బ్రాంచ్‌లు ఉన్నాయని, తొలిసారిగా ప్రదర్శన నిర్వహిస్తున్నారని, తక్కువ ధరలకే దుస్తులను విక్రయిస్తున్నారన్నారు. తొలుత రష్మీగౌతమ్ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, కాసం నిర్వాహకులు నమఃశివాయ, యంసాని ప్రవీణ్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి నుంచి
శిశుగృహకు శాన్వీ..
భద్రాచలంఅర్బన్: పాప పుట్టిందని తెలిస్తే కులపెద్దలు బషిష్కరిస్తారనే భయంతో ఈ నెల 22న భద్రాచలం పట్టణంలోని రాములోరి అన్నదాన సత్రం వద్ద వదిలేసిన 45 రోజుల వయసున్న పాప శాన్వీని ఆస్పత్రిలో చేర్పించగా.. కోలుకోవడంతో మంగళవారం రాత్రి శిశుగృహకు తరలించారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు చికిత్స అందించారు. వైద్యుడు విజయ్ పర్యవేక్షించగా.. పాప కోలుకుని, 400 గ్రాముల బరువు పెరిగిందని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో అధికారులు శాన్వీని బ్రిడ్జి సెంటర్‌లో గల శిశుగృహానికి తరలించారు.
ర్యాకింగ్ సిస్టమ్
ప్రారంభం
పాల్వంచ: సూపర్ క్రిటికల్ టెక్నాలజీ 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలోని స్టోరేజ్ షెడ్‌లో ర్యాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్‌లో నిత్యం అవసరమయ్యే స్పేర్ మెటీరియల్‌ను క్రమపద్ధతిలో ఉంచడటంతో పాటు అవసరానికి వినియోగించేందుకు లైట్, హెవీ.. రెండు వేర్వేరు స్టోరేజ్‌లను రూ.4.90 కోట్లతో ఏర్పాటు చేశారు. కాగా ఇందులో హేవీ స్టోరేజ్ షెడ్–1లో ర్యాకింగ్ సిస్టమ్ ను చీఫ్ ఇంజనీర్ బి.శివరామ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కర్మాగారంలో స్పేర్ పార్ట్స్ వినియోగాన్ని మరింత పటిష్టం చేయడానికి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు యుగపతి, రాజ్‌కుమార్, కిరణ్‌కుమార్, హరిలాల్, జేఎస్ మల్లేశ్వరి, ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కొట్టుకుపోయిన
తాత్కాలిక రహదారి
టేకులపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి పాత తండా నుంచి రాంపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రాళ్లవాగుపై నిర్మిస్తున్న నూతన వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక దారి వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాంపురం గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


