పాల్వంచరూరల్: తల్లి మందలించిందనే మనస్తాపంతో పురుగులమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు జీపీ కొత్తూరు గ్రామానికి చెందిన కాలం బాబు, లక్ష్మి దంపతుల కుమార్తె కాలం రమ్య (20) నాలుగు రోజుల క్రితం పురుగులమందు తాగగా.. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు
అశ్వాపురం: మండలంలో సీఐ ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలపై అనుమానిత ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, కిరాణా దుకాణాల్లో బుధవారం నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేశ్ మాట్లాడుతూ.. డాగ్ స్క్వాడ్ సాయంతో గంజాయిని ఎక్కడ దాచి ఉంచినా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయా లు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
పాల్వంచరూరల్: గంజాయిని విక్రయించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కిన్నెరసానిలోని కేటీపీఎస్ కెనాల్ వద్ద బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐ సురేశ్‌కు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద సుమారు రూ.40 వేల విలువ గల ఎండు గంజాయి దొరికింది. గంజాయిని విక్రయించేందుకు ములకలపల్లి మండలం వడ్డురామవరానికి చెందిన గుగులోతు వినోద్, కిన్నెరసానికి చెందిన ఎస్‌కే ఆఫ్రీద్ ఇక్కడికి వచ్చారని తేలగా.. వారిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


