మాయమవుతున్న ప్లాంటేషన్లు
● సరిహద్దుల్లో అక్రమ కలప దందా.. ● భద్రాచలం కేంద్రంగా కోతలు, రవాణా ● చెక్‌పోస్టులకు చిక్కకుండా గోదావరి మార్గంలో తరలింపు
భద్రాచలంటౌన్: ఒకప్పుడు అడవి అంటే భయం.. అన్నల(మావోలు) భయంతో అటవీ సంపద జోలికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది. కానీ ఇప్పుడు అన్నలు లేకపోగా అధికారులు సైతం సహకరిస్తుండడంతో అక్రమార్కులు పండుగ చేసుకుంటున్నారు. ఫలితంగా ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విలువైన టేకు సంపద కనుమరుగవుతోంది. అడవుల్లో భారీ టేకు వృక్షాలను విచక్షణారహితంగా నరికి, అత్యాధునిక మిషన్లతో అక్కడికక్కడే దిమ్మెలుగా కోసి భద్రాచలం డివిజన్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. తనిఖీలతో అక్రమార్కులను అడ్డుకోవాల్సిన భద్రాచలం సరిహద్దు చెక్ పోస్టు సిబ్బంది మామూళ్ల మత్తులో తూలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గోదావరి మీదుగా..
భద్రాచలం డివిజన్‌లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రేంజ్‌లకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని అడవుల్లో నరికిన భారీ టేకు వక్షాలను ఆధునిక రంపపు మిషన్ల సాయంతో అక్కడికక్కడే దిమ్మెలుగా మార్చి.. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా గోదావరి తీరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. అనంతరం పడవలు, మోటార్ బోట్లలో నదిని దాటించి లారీలు, ఇతర వాహనాల ద్వారా కావాల్సిన చోట్లకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలను తప్పించుకోవడానికి గోదావరి నదిని మార్గంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ మార్గంలో పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో రవాణా నిరాటంకంగా సాగుతోందని సమాచారం.
తక్కువకు కొనుగోలు.. లాభాలతో విక్రయం
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో పెద్ద మొత్తంలో టేకు కలప లభిస్తుండడంతో అక్రమ వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక పటిష్టమైన నెట్‌వర్క్ ఉందని తెలుస్తోంది. ఇటీవల అటవీ శాఖ అధికారులు పలు చోట్ల టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అయితే పట్టుబడుతున్నది స్వల్పమేనని... రోజూ పెద్ద మొత్తంలో కలప సరిహద్దులు దాటుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కలప అక్రమ రవాణాను అరికట్టేలా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ బలోపేతం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయంపై ఆధారాలతో ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరికై కా వృక్షాల నరికివేత, అక్రమ కలప రవాణా వివరాలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి.
– జస్వత్ ప్రసాద్, ఎఫ్‌ఆర్‌ఓ, భద్రాచలం
దశాబ్దాలుగా పెరిగిన విలువైన టేకు వృక్షాలను నరికేస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. అటవీ సంపద క్షీణిస్తుండడంతో జీవవైవిధ్యం, వర్షపాతం, భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే దందా కొనసాగుతోందన్న ప్రచారం ఉంది. అక్రమ రవాణా మార్గాలు, నిల్వ కేంద్రాలపై సమాచారం ఉన్నా కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడు లెక్కల కోసమే కేసులు పెడుతున్నారనే సమాచారం. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ అటవీ శాఖలు, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తే తప్ప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం కానరావడం లేదు. అంతేకాక గోదావరి తీరాన రాత్రివేళ గస్తీ పెంచడం, పడవల తనిఖీలతో ఫలితం ఉంటుందని చెబుతున్నారు.


