భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం పూర్తిచేశారు. మంగళవారం సందర్భంగా అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన జరిపారు.
దమ్మక్క యాత్రకు
ప్రత్యేక బస్సులు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన బుధవారం దమ్మక్క సేవాయాత్ర జరగనుంది. ఇందులో పాల్గొనేలా వివిధ ప్రాంతాల గిరిజన భక్తులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఈమేరకు తొమ్మిది ప్రత్యేక బస్సులను మంగళవారం భద్రాచలం బస్టాండ్‌లో డిపో మేనేజర్ జంగయ్య ప్రారంభించారు. ఈ బస్సులు గిరిజన గ్రామాలకు వెళ్లి భక్తులను ఉచితంగా భద్రాచలం తీసుకురానున్నాయి. యాత్రకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం, ఆర్టీసీ సమన్వయంతో ఏర్పాట్లుచేసినట్లు డీఎం తెలిపారు. గిరిజన భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సమ్మె నోటీసుపై వచ్చేనెల 6న ఆర్‌ఎల్‌సీతో చర్చలు
రుద్రంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహణ, ఇతర సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డాక్టర్ సరస్వతి సమక్షాన యాజమాన్యంతో రెండో విడత చర్చలు జరిగాయి. ఇంకో విడత చర్చలు ఆగస్టు 6వ తేదీన జరగనుండగా, అప్పుడు కూడా ఫలితం రాకపోతే 16వ తేదీ నుంచి అన్ని సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఇప్పటికే ఓసారి మెడికల్ బోర్డ్ నిర్వహించినట్లు యాజమాన్యం చెప్పగా.. పారదర్శకంగా జరగలేదన్న తమ వాదనకు స్పందించిన ఆర్‌ఎల్‌సీ మరోమారు నిర్వహణకు పరిశీలించాలని ఆదేశించిందని వెల్లడించారు. మిగతా అంశాలపై యాజమాన్యం, ఏఐటీయూసీ చర్చించి వచ్చేనెల 6న జరిగితే సమావేశంలో నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎల్‌సీ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(పర్సనల్) బి.రాజగోపాల్, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారని సీతారామయ్య తెలిపారు.
నాణ్యమైన బోధనతో విద్యార్థులకు భవిష్యత్
ఇల్లెందు: నాణ్యమైన బోధన అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్‌కు పటిష్టమైన పునాది వేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాక యూడైస్ వివరాలు సకాలంలో నమోదు చేసి బోధన, ప్రాక్టికల్స్‌పై దృష్టి సారించాలని తెలిపారు. అంతిమంగా అత్యుత్తమ ఫలితాల సాధనే అందరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ భానుప్రసాద్, అధ్యాపకులు ప్రసాదరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు.


