జిల్లా అడవిలో పెద్దపులి జాడ కనిపించడం లేదు. అప్పుడప్పుడూ అతిథిలా వచ్చివెళ్తున్న పులి స్థిరనివాసం మాత్రం ఏర్పాటు
చేసుకోవడం లేదు. జిల్లాలో కిన్నెరసాని
అభయారణ్యంతో పాటు దట్టమైన అడవులు ఉండగా, వేలాదిగా వన్యప్రాణులు
నివసిస్తున్నాయి. అయినా పులి మాత్రం ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. గతేడాది కాలంగా ఏపీ నుంచి
అశ్వారావుపేట రేంజ్‌లోకి, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏటూరునాగారం మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చివెళ్లిన దాఖలాలు ఉన్నాయి. పెద్దపులి స్థిరని
వాసానికి అనువైన పరిస్థితులు ఉన్నా ఇక్కడే ఎందుకు ఉండడం లేదనేది తేలడంలేదు.
– పాల్వంచ రూరల్
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
కిన్నెరసాని అభయారణ్యంలోని మర్కోడు, రంగాపురం, అనంతోగు, మల్లేపల్లితోగు ప్రాంతాల్లోని దట్టమైన అడవిలో పెద్దపులుల సంచారం కొన్నేళ్ల క్రితం ఉండేది. ఎప్పుడైతే జిల్లా అటవీ ప్రాంతంలోకి ఛత్తీస్‌గఢ్ నుంచి గొత్తికోయలు వలస వచ్చారో ఆనాటి పరిస్థితిలో మార్పు వచ్చింది. అడవిలో 2 లక్షల ఎకరాలకు పైగా పోడు సాగు చేయడం, దట్టమైన అడవిలో చెట్లను నరికివేయడం, ఇంకొంత ఆక్రమణలకు గురవడంతో దట్టమైన అడవి కాస్తా పలుచబడింది. ఫలితంగా పులులు ఇక్కడ నివాసం ఉండలేక వలసబాట పట్టాయి. 2018లో జరిగిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచారం నమోదు కాలేదు. మళ్లీ 2020 డిసెంబర్, 2021 జనవరిలో పెద్దపులి సంచారం కనిపించినా ఆవాసం ఏర్పాటు చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయింది. ఇక 2025 ఫిబ్రవరిలో జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఆరు నెలలుగా ఇక్కడే సంచరించిందని అటవీ శాఖ అధికారులు గుర్తించి జిల్లా పేరు కలిసొచ్చేలా ‘భద్ర’అని నామకరణం చేశారు. అయితే, ప్రస్తుతం దాని జాడ కూడా లేదు.


