‘రైతునేస్తం’ చక్కటి అవకాశం
● రైతులకు విస్తృతంగా అవగాహన ● మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ అంకిత్
జూలూరుపాడు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూలూరుపాడు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నందున రైతులు వరికి బదులు మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయాలతోపాటు, ఇతర ఆరుతడి సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు. అంతేకాక ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతీ పొలంలో పంట కుంట, ప్రతీ ఊరిలో ఊట కుంట, కమ్యూనిటీ కుంటలు నిర్మించేలా పర్యవేక్షించాలని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 99 ఫారం పాండ్లు నిర్మించడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించామని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. మండల ప్రత్యేక అధికారి శ్రీలత, ఎంపీడీఓ తాళ్లూరి రవి, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఏఓ దీపక్ ఆనంద్, పీహెచ్‌సీ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఎంఈఓ బి.జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూసమస్యలను కేటగిరీల వారీగా వర్గీకరించి, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను ముందుగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగుపల్లి, లచ్చగూడెం, పాల్వంచ, ఉప్పుసాక, కరకగూడెం ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న భూ సమస్యలను జాయింట్ సర్వే ద్వారా త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే, తాగునీటి సమస్య దృష్ట్యా బోర్లు, మిషన్ భగీరథ, తాగునీటి పథకాల అనుమతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయాలని తెలిపారు. ఇప్పటికే గృహాలు ఉండి అదే స్థలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టేవారికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని, కొత్తగా మాత్రం ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో రహదారి, ఇతర వసతుల కల్పన, సింగరేణి ఓసీల విస్తరణ అనుమతులపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు దరఖాస్తులు, ఇతర అంశాలపై మాట్లాడగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, అధికారులు పాల్గొన్నారు.
ములకలపల్లి: అన్నదాతల సందేహాలు నివృత్తి చేయడం, సాగులో మెళకువలు వివరించేందుకు ‘రైతు నేస్తం’ చక్కటి అవకాశమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ములకలపల్లి మండలం పూసుగూడెం రైతువేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ వందో ఎపిసోడ్‌ను వీక్షించిన ఆయన మాట్లాడారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. అనంతరం రైతునేస్తం కార్యక్రమాలకు క్రమం తప్పక హాజరైన రైతులు, ఏఈఓలను కలెక్టర్ సన్మానించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ భరత్, ఎంఏఓ అరుణ్‌బాబు, సర్పంచ్‌లు ధర్మ, రవి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


