రామయ్య బంగారు, వెండి ఆభరణాల తరలింపు | - | Sakshi
Sakshi News home page

రామయ్య బంగారు, వెండి ఆభరణాల తరలింపు

Jul 29 2026 12:40 AM | Updated on Jul 29 2026 12:40 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి, వాహనాలను మంగళవారం అధికారులు స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హన్మంతరావు ఆదేశాలతో ఆలయ పునరుద్ధరణ పనుల్లో వేగం పెరిగింది. ఇందులో భాగంగా భక్తులు సమర్పించిన, శ్రీరామదాసు చేయించిన నగలతో పాటుగా వెండి వాహనాలు, సామగ్రిని మ్యూజియం నుంచి పటిష్ట భద్రత నడుమ ఈఓ దామోదర్‌రావు ఆధ్వర్యాన రంగనాయకుల గుట్టపై స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. మరోపక్క చిత్రకూట మండపం ఎదుట ఉన్న గోశాల తొలగింపు పూర్తయింది. చిత్రకూట మండపంలోని స్తంభాల తరలింపు పనులు పూర్తికాగానే పడమర మెట్లను తొలగిస్తారు. ఇంకోపక్క మిథిలా స్టేడియంలో నిత్యకల్యాణ వేదిక నిర్మాణం కొనసాగుతోంది.

నేడు దమ్మక్క శోభాయాత్ర, కల్యాణోత్సవం

భద్రగిరిలో బుధవారం దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గత 12ఏళ్లుగా జరుగుతున్న ఈ యాత్ర వేదికను పనుల నేపథ్యాన మార్చారు. ఉదయం 6–30గంటలకు దమ్మక్క చిత్రపటంతో శోభాయాత్ర, దమ్మక్క విగ్రహం వద్ద పూజలు, అనంతరం తానీషా కల్యాణ మండపం వెనకాల మారుతి సదనంలో ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ గ్రామాల గిరిజనులు చేరుకోగా, ఆలయంలో దర్శనం చేయించి పూజలు ముగిశాక అన్నప్రసాదం అందజేసి తిరిగి గ్రామాలకు బస్సుల ద్వారా పంపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement