జూలూరుపాడు: మండలంలోని కాకర్ల జెడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ డైరెక్టర్ చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. కాకర్ల హైస్కూల్‌లో విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామమైన సుజాతనగర్ వెళ్తుండగా డేగలమడుగు సమీప బంక్ వద్ద గుండెపోటు రావడంతో కిందపడ్డారు. ఈ విషయాన్ని వెనకాల ఆటోలో వస్తున్న ఉపాధ్యాయురాలు కల్యాణి, బంధువు కృష్ణ, స్థానికులు గుర్తించి యుగంధర్‌కు సీపీఆర్ చేసి 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పీడీ సోదరుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో సుజాతనగర్ ఎస్‌ఐ ఎం.రమాదేవి కేసు నమోదు చేశారు. కాగా, యుగంధర్ మృతిపై జూలూరుపాడు ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కాకర్ల హైస్కూల్ హెచ్‌ఎం పి.సంజీవరావు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువకుడు..
పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి
వచ్చి మృత్యువాత
పినపాక: బతుకుదెరువు కోసం వచ్చిన ఆ యువకుడిని విద్యుత్‌షాక్ బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న క్రమంలో ఊహించని ప్రమాదం దెబ్బతీసింది. మండలంలోని ఈ–బయ్యారం క్రాస్‌రోడ్డు వారపు సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు యువకులు పొట్టకూటి కోసం స్వ గ్రామాన్ని వదిలి మణుగూరులో నివాసముంటూ బాదంపాలు, ఐస్‌క్రీమ్స్ అమ్ము కుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవా రం కూడా బయ్యారం క్రాస్‌రోడ్డులోని వారపు సంతకు టాటా ఏస్ వాహనంలో ఐస్‌క్రీమ్స్, బాదంపాలు తీసుకొచ్చా రు. జనరేటర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా.. ఒక్కసారిగా షాక్ కొట్టి శ్యామ్‌లాల్ (23) అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు సీపీఆర్ చేసి, 108లో మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
గోదావరిలో పడి వ్యక్తి ..
అశ్వాపురం: మండలంలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్టమల్లయ్య గుంపు గ్రామానికి చెందిన కలేటి వెంకటేశ్వర్లు (54) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం పొలం పనులకు వెళ్లిన వెంకటేశ్వర్లు సాయంత్రం సయయాన బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడ్డాడు. ఒడ్డున చెప్పులు ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మంగళవారం గాలించడంతో ఆయన మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె రమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూర్యారావు తెలిపారు.
రుణం ఆశ చూపి.. ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి..
మహిళ నుంచి రూ.6.90 లక్షలు
స్వాహా చేసిన నేరగాళ్లు
బూర్గంపాడు: తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి బూర్గంపాడులోని గౌతమీపురానికి చెందిన ఓ మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు స్వాహా చేశారు. ఆమె ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు వివరాలు తీసుకున్న నేరగాళ్లు ఆ తర్వాత ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ చేశారు. అడిగినంత నగదు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించడంతో బాధితురాలు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు పలు ధపాలుగా రూ 6.90 లక్షలు పంపించింది. అయినా ఇంకా డబ్బు పంపించాలని ఒత్తిడి చేస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదుతో ఎస్‌ఐ మేడ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేయడమే కాక, సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లో ఉన్న రూ.3.30లక్షలను హోల్డ్ చేయించారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వొద్దని ఎస్‌ఐ సూచించారు.
కోడిగుడ్ల రిక్షాను
ఢీకొట్టిన లారీ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మంగళవారం ఉదయం ఓ ఇసుక లారీ ప్రమాదవశాత్తు కోడిగుడ్లు తరలిస్తున్న రిక్షాను ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రిక్షాలో కోడిగుడ్లు తరలిస్తుండగా అంబేడ్కర్ సెంటర్‌లో ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో అతడికి స్వల్పగాయాలు కాగా, రిక్షా ధ్వంసమైంది. కోడిగుడ్లు మొత్తం పగిలిపోయాయి. లారీ ఇంకాస్త వేగంగా ఉండి ఉంటే రిక్షాను తొక్కుకుంటూ వెళ్లి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇసుక లారీల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


