వచ్చేనెల 1 వరకు దరఖాస్తులు
● అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ ● 192 టీచర్ పోస్టులకు 4,648.. 1,011 ఆయా పోస్టులకు 1,725 ● సర్టిఫికెట్ల పరిశీలన, త్వరలోనే ఇంటర్వ్యూలు
భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా టీచర్, ఆయా పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది పూర్తయ్యాక మైదాన ప్రాంతంలోని కేంద్రాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు.
భారీ సంఖ్యలో దరఖాస్తులు
అంగన్‌వాడీల్లో టీచర్ పోస్టులకు ఈ నెల 2న, ఆయా పోస్టులకు 20న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2,061 కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాలు 1,203 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, 1,203 పోస్టులకు గాను 6,373 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు టీచర్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా ఆయా పోస్టులకు వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరోమారు సర్టిఫికెట్లు పరిశీలించాక, జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అడిషనల్ కలెక్టర్, సబ్‌కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు.
పోస్టులు దక్కించుకునేలా..
అంగన్‌వాడీ పోస్టులు దక్కించుకునేందుకు కొందరు తమ పలుకుబడి ఉపయోగించి పైరవీలకు తెర లేపినట్లు సమాచారం. అలాగే తమ వారికే పోస్టు కేటాయించాలని కొందరు రాజకీయ నాయకులు సైతం ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్‌లో 70 శాతం మార్కులు వచ్చినవారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. అంతేకాక వితంతువులకు ఐదు, దివ్యాంగులకు ఐదు, అనాథలకు 10 మార్కులు ఇస్తూ, ఇంటర్వ్యూలకు 10 మార్కులు కేటాయిస్తారు.
కుల ధ్రువీకరణతో సమస్య
ఏజెన్సీ ప్రాంతంలో అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొందరు తమ భర్త కులాన్ని పేర్కొంటూ అదే సర్టిఫికెట్ సమర్పించారు. అయితే, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రమే సమర్పించాలని, అధికారులు సూచిస్తున్నా స్పందన రావడం లేదని సమాచారం. అంతేకాక భర్త కులం తమకు ఎందుకు వర్తించదని వాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా పోస్టుల భర్తీ మాత్రం పారదర్శకంగా చేపట్టాలని, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి అందిన దరఖాస్తుల పరిశీలన చివరి దశకు చేరింది. ఈ క్రమాన అనర్హులు, సర్టిఫికెట్లు సరిగ్గా లేనివారి దరఖాస్తులను తిరస్కరించాం. ఇక ఆయా పోస్టులకు మాత్రం వచ్చేనెల 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
– స్వర్ణలత లెనీనా,
జిల్లా, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారి


