టేకులపల్లి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా వ్యవసాయాధికారి బాబూ రావు సూచించారు. సోమవారం మండలంలోని కోయగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించారు. రైతులకు కంది, పెసర, వివిధ రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. వర్షాధార ప్రాంతాలతోపాటు బోరుబావుల కింద సాగు చేసే రైతులు కూడా తక్కువ నీటితో మెరుగైన దిగుబడినిచ్చే కంది, పెసర, మినుము, శనగ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను వేయాలన్నారు. అధిక నీటి వినియోగం వల్ల భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌కు కావలసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అధికారులు కిషోర్, భరత్, లాల్ చాంద్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


