సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరి ష్కారం కోసం సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి ఈసారి జనం తగ్గారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందనతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. భూ వివాదాలు, రెవె న్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అందజేశారు.
దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలిలా..
● 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఇల్లు, స్థలానికి పట్టా మంజూరు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన లక్ష్మి అర్జీ అందించగా, కొత్తగూడెం తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
● తన భర్త మృతి చెందాడని, ఆయన పేరు మీద ఉన్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా తన పేరు మీద మార్చాలని ఇల్లెందు మండలం వేపలగడ్డ గ్రామ పంచాయతీ బొచ్చాయిగూడేనికి చెందిన బుగ్గ పద్మ ఫిర్యాదు చేశారు.
● ఇందిరమ్మ పథకంలో ఎల్–3లో ఉన్న పేరును ఎల్–1లోకి మార్చాలని అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి రత్నకుమారి వినతిపత్రం ఇవ్వగా, దరఖాస్తును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు.
● ఆసుపాక రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 191/6లో ఉన్న 4 ఎకరాల 20 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన బేతి వెంకాయమ్మ అర్జీ పెట్టుకోగా, అశ్వారావుపేట తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
సకాలంలో వైద్య సేవలు అందించాలి
చుంచుపల్లి: ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు సకా లంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని సూచించారు. ఓపీ, పది రోజులుగా నమోదైన జ్వర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగీ, హెచ్‌ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న రక్త పరీక్షల వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మందుల నిల్వ గదిని సందర్శించారు. యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్ల లభ్యత వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుష్ క్లినిక్‌ను సందర్శించి సేవలు, ఔషధాల వివరాలను తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తతంగా ఉండాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో జ్వరాల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తహసీల్దార్ శిరీష, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


