సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈ నెల 30న భద్రాచలంలోని శిశుమందిర్ స్కూల్ ఎదురుగా ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ఆగస్టు 7, 8 తేదీలలో హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 30న భద్రాచలం తరలిరావాలని కోరారు.
వీఓఏలను ఉద్యోగులుగా గుర్తించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ డిమాండ్ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్‌లు, నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు కె.సత్య, భూక్య రమేష్, అరుణ, రేష్మ, కృష్ణవేణి, నాగరాజు, అనురాధ, మీనా, ధనలక్ష్మి, నాగేంద్రమ్మ, శ్యామ్, కొమరయ్య పాల్గొన్నారు.
యోగా పోటీల్లో ప్రతిభ
జూలూరుపాడు: కొత్తగూడెం హనుమాన్ బస్తీలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడుకు చెందిన ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు ప్రతిభ చాటా రు. తాళ్లూరి నవీన్, వేముల నాగేశ్వరరావు, వేల్పుల బోసు, పెండ్యాల నరేష్ బహుమతులను గెలుచుకున్నారు. తాళ్లూరి నవీన్ జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించగా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.
కౌన్సెలింగ్ ద్వారా
గురుకులాల్లో సీట్ల భర్తీ
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధి గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నామని రీజినల్ కోఆర్డినేటర్(ఆర్‌సీఓ) అరుణ కుమారి తెలిపారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలిక పాఠశాలలో సోమవారం 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్‌ను ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న 336 సీట్లను ప్రవేశపరీక్షలోని మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడ సీటు లభించినా విద్యార్థులు చేరాలని సూచించారు. వివిధ గురుకులాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు మాధవీలత, చైతన్య, హరికృష్ణ, భద్రయ్య, ఉపాధ్యాయులు, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ
పోటీలకు ఎంపిక
భద్రాచలంటౌన్: పట్టణంలోని సీటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు మోడెమ్ వంశీ హైదరాబాద్‌లో ఇటీవల యాదవ్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి స్ట్రాంగ్‌మెన్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ప్రథమ స్థానంలో నిలవడంతో రూ.1.25లక్షల నగదు బహుమతిని అందించా రు. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు వి. మల్లేష్, బోగాల శ్రీనివాస్‌రెడ్డి, జీవీ రామి రెడ్డి, శివరామకృష్ణ ప్రసాద్, భవానీ శంకర్, వెంకటకృష్ణాజీ తదితరులు విజేతను అభినందించారు.
చేపల వేటకు వెళ్లి గల్లంతు?
అశ్వాపురం: మండల పరిధిలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్ట మల్లయ్య గుంపు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి గోదావరిలో గల్లంతైనట్లు తెలిసింది. చేపల వేటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


