మెరిసిన మిర్చి ధర | - | Sakshi
Sakshi News home page

మెరిసిన మిర్చి ధర

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

● తేజా రకం క్వింటాకు రూ.22,700 ● క్వింటాకు రూ.700 అ‘ధనం’

● తేజా రకం క్వింటాకు రూ.22,700 ● క్వింటాకు రూ.700 అ‘ధనం’

ఖమ్మంవ్యవసాయ: మిర్చి ధరకు రెక్కలొచ్చాయి. విదేశీ రకంగా పేరు గడించిన ‘తేజా’ రకం మిర్చికి డిమాండ్‌ పెరిగింది. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం తీసుకొచ్చిన మిర్చి క్వింటాకు జెండాపాటలో గరిష్టంగా రూ.22,700లు పలికింది. కొద్దిరోజులుగా రూ. 22 వేలు ఉన్న ధర రూ. 700 పెరగగా.. మోడల్‌ మిర్చి ధర రూ.21,800గా నమోదైంది. నాన్‌ ఏసీ మిర్చి ధర రూ.16వేల నుంచి 17 వేల వరకు పలుకుతుండగా, రూ.17,400కు చేరింది. ఇక రూ.9 వేలుగా ఉన్న తాలు మిర్చి ధర గరిష్టంగా రూ.10 వేలు, మోడల్‌ ధర రూ. 9.500లుగా పలికింది. ఖమ్మం మార్కెట్‌కు నిత్యం ఏసీ, నాన్‌ఏసీ మిర్చి కలిపి 10 వేల నుంచి 15 వేల బస్తాల వరకు విక్రయానికి వస్తోంది. జిల్లాలోని 48 కోల్డ్‌స్టోరేజీల్లో దాదాపు 30 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ సరుకంతా వ్యాపారులదేనని తెలుస్తోంది. సీజన్‌లో రైతుల నుంచి రూ.17 వేల నుంచి రూ.18 వేల చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేయగా, ఇప్పుడు ధర పెరుగుతుండడంతో లబ్ధి పొందనున్నారు.

ఎగుమతుల ప్రభావం

ఖమ్మం మార్కెట్‌లో డిమాండ ఉన్న ‘తేజా’ రకం మిర్చిని చైనాకు ఎగుమతి చేస్తారు. కానీ గత రెండు సీజన్లుగా చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక డిమాండ్‌ లభించడం లేదు. చైనాలో ఈ రకం పంట సాగు పెరగడం, నిల్వలు ఉండడం తదితర కారణాలతో ఎగుమతులు పడిపోయాయి. ఇదే సమయాన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌ నుంచి కొన్నాళ్లుగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో మిర్చిధర పుంజుకుంటున్న వేళ విక్రయాలు పెరిగాయి.

వర్షాభావ పరిస్థితులు కూడా..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొలకొనగా, మిర్చి సాగు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024–25లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండగా గరిష్టంగా రూ. 15 వేలకు మించి ధర పలకలేదు. దీంతో 2025–26లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. జిల్లాలో కేవలం 33వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సీజన్‌లో మిర్చి ధర రూ.18 వేల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.22,700గా పలుకుతోంది. అయినా వర్షాభావ పరిస్థితుల్లో మిర్చి సాగు పడిపోతుందనే అంచనాతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకొస్తుండగా డిమాండ్‌ పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement