సీతారామ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత
సుమారు రూ. 22 కోట్ల విద్యుత్ బిల్లు..
పాల్వంచరూరల్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గత 20 రోజులుగా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు ఫేస్–1 పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను 110 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవహిస్తున్నాయి. ఈ నెల 8న సోమవారం వరకు 20 రోజుల్లో బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇందుకోసం మొదటి పంపుహౌస్ వద్ద 25 మెగావాట్లు, రెండో పంప్‌హౌస్ వద్ద 40 మెగావాట్లు, మూడో పంప్‌హౌస్ వద్ద 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లను వినియోగిస్తున్నారు.
రోజుకు రూ.1.02 కోట్ల విద్యుత్ బిల్లు
గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాకు విడుదల చేస్తున్న నీటి సరఫరాకు భారీగా విద్యుత్ బిల్లు వస్తున్నట్లు సమాచారం. రోజుకు రూ.1.02 కోట్ల చొప్పున అవుతుందని, 20 రోజులకు సుమారు రూ. 22 కోట్ల బిల్లు వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే జలవనరుల శాఖపై మరింత విద్యుత్ భారం పడుతుందనే చర్చ సాగుతోంది.


