అత్యాధునిక రీతిలో భవనాల
నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
స్థలాల పరిశీలనలో అధికారులు,
త్వరలోనే శంకుస్థాపన
కార్పొరేట్ లుక్!
ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నవి కొన్ని, అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో కొపాగుతున్నవి ఇంకొన్ని.. ఇలా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో సమస్యల నడుమ అటు అధికారులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతుండగా వీటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన వసతులు, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 48 సబ్ రిజిస్ట్రార్, మూడు జిల్లా రిజిస్ట్రార్, రెండు డీఐజీ కార్యాలయాల నిర్మాణాలకు రూ.97 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ఖమ్మం ఆర్‌ఓ కార్యాలయంతో పాటు మరో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
దశాబ్దాలుగా అద్దె భవనాల్లో..
ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం తీసుకొస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు చాలీచాలని ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో సర్దుకుంటూనే రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్‌ఓ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం నూతన భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడంతో ఆర్‌ఓ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త కళ రానుంది.
ఎక్కడెక్కడ..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ఆరు కీలక కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. ఇందులో ఖమ్మం ఆర్‌ఓ కార్యాలయానికి నూతన భవనం మంజూరైంది. ఇందులోనే రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. ఇక ఖమ్మంరూరల్, కూసుమంచి, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం ఆర్‌ఓ కార్యాలయానికి రూ.2 కోట్లు కేటాయించే అవకాశముండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్థలాల వేటలో యంత్రాంగం
నూతన భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో స్థలాలను కేటాయించినా, వాటిని పక్కన పెట్టి కొత్త స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు నూతన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా, ప్రధాన రహదారికి సమీపాన ఉండే స్థలాల కోసం అన్వేషిస్తుండగా, వారంలో ఇది ఓ కొలిక్కి రానుందని సమాచారం.
హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో..
భవనాల నిర్మాణ బాధ్యతలతో పాటు పర్యవేక్షణను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా సువిశాలమైన వెయిటింగ్ హాళ్లు, కార్పొరేట్ మోడల్ కౌంటర్లు, తాగునీటి వసతే కాక విస్తారమైన పార్కింగ్ వసతులతో ఈ భవనాలను నిర్మించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆరు కార్యాలయాల నిర్మాణం
స్థలాలను పరిశీలన చేస్తున్నాం..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆర్‌ఓ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మం ఆర్‌ఓతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన స్థలాల పరిశీలన వారంలోగా ఓ కొలిక్కిరానుంది.
–ఎ.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం


