తిరుమలాయపాలెం: అభంశుభం తెలియని ఆ చిన్నారికి అంతపెద్ద జబ్బు ఉందని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. ఆటపాటలతో ఆడుకునే వయస్సులో పసిపాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు జన్యు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తేల్చారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే తప్ప పాపప్రాణాలు కాపాడే పరిస్థితి లేదని, ఇందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఈ మేరకు దాతలు చేయూతనిచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కన్నీటి పర్యంతం
తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన కాంపాటి రవీందర్ – సృజన దంపతుల ఐదేళ్ల కుమార్తె కశ్విక అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతింటుండగా శ్వాస తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. ఆమెను పరీక్షించిన వైద్యులు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే మార్గమని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలోని అంకుర ఆస్పత్రిలో కశ్విక చికిత్స పొందుతుండగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించాల్సిన చికిత్సకు సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని సమాచారం. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ – సృజన దంపతులు తమ బిడ్డను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 70950 21080, 62815 31963 నంబర్లను సంప్రదించి ఫోన్‌పే ద్వారా నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.


