మిథిలా స్టేడియంలో.. | - | Sakshi
Sakshi News home page

మిథిలా స్టేడియంలో..

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో

పనులు ప్రారంభం

ఆలయంలో భక్తుల దర్శనానికి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నిత్యకల్యాణ వేదిక

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో భక్తుల ఆర్జిత సేవలకు, దర్శనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇతర చోట్ల జరుగుతున్న దేవస్థానం అభివృద్ధిలో బాలాలయంలో మూలమూర్తులను తరలించి నిర్మాణ పనులు చేస్తుండటంతో భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకావడంలేదు. భద్రగిరి క్షేత్రంలో భక్త రామదాసు నిర్మించిన అంతరాలయాన్ని, మూలమూర్తులను అదే రీతిన ఉంచి నిర్మాణం జరపాలని భావించటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని ఆళ్వార్లు, ఉపాలయాల మూలమూర్తులను అంతరాలయంలో ఉంచటంతో, అంతరాలయంలో జరిగే పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. వెండి వాకిలి వద్దనే ఇతర పూజలు జరుగుతున్నాయి. పనులు ముమ్మరమైతే వీటిని సైతం త్వరలో నిలిపివేసే పరిస్థితి నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే నిత్యకల్యాణ వేదికను సైతం మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా.. సదరు కాంట్రాక్టర్‌ ప్రారంభించటంలో అలసత్వం వహించారు. రెండు రోజుల క్రితం భద్రాచలంలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు కాంట్రాక్టర్‌, ఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యకల్యాణాలను మిథిలా స్టేడియంలో ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆ పనులను ఎట్టకేలకు కాంట్రాక్టర్‌ ప్రారంభించారు. స్టేడియంలో కల్యాణ వేదిక ఎదురుగా మట్టి తీసే పనులు నడుస్తున్నాయి. ఇక్కడే తాత్కాలిక నిత్యకల్యాణ వేదిక ఏర్పాటు కానుంది. ఇందుకు సుమారు రూ. 15 లక్షల వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు.

దక్షిణ ద్వారం నుంచి వచ్చి..

ఉత్తర ద్వారం నుంచి వెళ్లేలా..

ఉత్తరం, దక్షణ దిక్కులలో కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక ఆలయ ప్రాంగణంలో ఇతర పనులను ప్రారంభించనున్నారు. దీంతో భక్తుల రాకపోకలకు, దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లడ్డూ కౌంటర్లు ఉన్న తూర్పు మెట్లను దర్శనం అనంతరం బయటికి వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. మూడు వైపులా పనులను ప్రారంభించిన నేపథ్యంలో తూర్పు మెట్లనే దర్శనానికి ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అంతరాలయానికి దక్షిణ ద్వారం గుండా వచ్చి స్వామి వారి దర్శనం అనంతరం ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చి తూర్పు మెట్ల మీదుగా బయటికి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులను సైతం త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో ప్రారంభించి, వేగంగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా లడ్డూ కౌంటర్లు ప్రస్తుతానికి యథా స్థానంలోనే ఉండనున్నాయి. చిత్రకూట మండపంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement