అశ్వాపురం: అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ నెల 17న అశ్వాపురం మండలం మనుబోతులగూడెంగ్రామ పంచాయతీ వేములూరు గ్రామంలో విధి నిర్వహణలో ఆటంకపరిచి ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరగకుండా చట్టపరమైన రక్షణ చర్యలు చేపట్టాలని విన్నవించారు. బీట్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, జిల్లాలోని అన్ని డివిజన్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు గోవిందు, బాగ్య, నరేష్, వెంకన్న, ఎర్రయ్య, అనూష, బాబూరావు, భీమ్‌చంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వినతి


