బోనకల్: ఎల్‌నినో దృష్ట్యా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యాన రైతులు పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నాగస్వాతి సూచించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలువురు రైతుల పంటలను పరిశీలించి సూచనలు చేశారు. రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును ఈ నెలాఖరు వరకు పోసుకోవచ్చని, నాట్లు వేసే వారం ముందు ఎకరాకు సరిపోయే వరి మడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలని తెలిపారు. అలాగే, పత్తికి రసం పీల్చే పురుగు, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పిండినల్లి ఆశిస్తున్నందున ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిట్రోనిల్ 1.5 మి.లీ.ను లీటర్ నీటికి కలపడంతో పాటు 19 –19–19.. 5 గ్రా. లేదా యూరియా 2 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, రాగి, నూనె గింజలు సాగు చేస్తే వాతావరణ పరిస్థితులను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, ఏఈఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


