సీఆర్‌పీఎఫ్ వాహనం ఢీకొట్టడంతో ఘటన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం రికార్డ్ అసిస్టెంట్ కటకాల రామిరెడ్డి (47) శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని ఎటపాక మండలం నెల్లి పాక జంక్షన్ వద్ద రామిరెడ్డి ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతుండగా సీఆర్‌పీఎఫ్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కింద పడి స్పృహ కోల్పోయిన ఆయనను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఏపీలోని పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలం కొట్టారుగొమ్ము గ్రామానికి చెందిన రామిరెడ్డి 2013లో భద్రాచలం దేవస్థానంలో ఉద్యోగిగా చేరాడు. అప్పటి నుంచి భద్రాచలంలో నివాసం ఉంటున్నా ఏడాది క్రితం పోలవరం ప్యాకేజీ వస్తుందనే సమాచారంతో ఎటపాక మండలం రామగోపాలపురంలో ఉంటూభద్రాచలానికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమా న శుక్రవారం కూడా వచ్చి తిరిగివెళ్తూ మృత్యువాత పడ్డాడు. ఆయన మృతిపై ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం తెలిసి కుటుంబీకులను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ..
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటీఐ కళాశాల వద్ద శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగు నరేశ్ (45) మృతి చెందాడు. ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నరేశ్‌ను వెనుకగా వేగంగా వచ్చిన లారీ నేరుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని సీఐ సురేశ్ సందర్శించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చికిత్స పొందుతున్న సర్పంచ్ మృతి
మృతదేహంతో భద్రాచలంలో ఆందోళన
పాల్వంచరూరల్/భద్రాచలం అర్బన్: కుడి కాలికి వాపు రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన మహిళా సర్పంచ్ పరిస్థితి విషమించి మృతిచెందింది. సర్పంచ్ భర్త ప్రేమ్‌కుమార్ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్‌రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్‌రావు ఆస్పత్రిలో చేర్పించారు. ఇన్‌ఫెక్షన్ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్‌లో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్‌కుమార్.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్‌రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు.


