వెనుకబడిన విద్యార్థులకు
ప్రత్యేక బోధన
ప్రతీ చిన్నారికి ప్రాథమిక నైపుణ్యాలే లక్ష్యం
అభ్యసన లోపాల నివారణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
ఈ నెల 21 నుంచి మండల కేంద్రాల్లో టీచర్లకు మొదలైన శిక్షణ
వంద శాతం అభ్యసనాభివృద్ధే లక్ష్యం..
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో కనీస నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కింద ‘రెమిడియేషన్’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మరింత పటిష్ఠంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
వెనుకబడిన విద్యార్థులకు చేయూత..
తరగతి గదిలో అందరు పిల్లల గ్రహణ శక్తి ఒకేలా ఉండదు. కొందరు ఇంటి వద్ద సరైన ప్రోత్సాహం లేక, హాజరుశాతం తక్కువగా ఉండడం లేదా గతంలో చెప్పిన పాఠాలు అర్థం కాకో చదువులో వెనుకబడుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించి ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడమే ఈ ‘రెమిడియేషన్’ ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల లోపాలను ప్రారంభ దశలోనే సరిదిద్దేందుకు ఉపా ధ్యాయులు ప్రతి రోజూ ఒక గంట సమయం కేటాయించి, వ్యక్తిగత శ్రద్ధతో లక్ష్యాధారిత బోధన సాగించనున్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ‘బేస్‌లైన్’ పరీక్ష ఆధారంగా కూడా వెనుకబడిన విద్యార్థులను గుర్తించనున్నారు.
రోజుకొక సబ్జెక్టు
విద్యార్థులపై నేర్చుకునే వేగం విషయంలో ఎలాంటి ఒత్తిడి పడకుండా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఓ ప్రత్యేక విద్యా క్యాలెండర్ రూపొందించింది. దీని ప్రకారం సాధారణ బోధనతో పాటు, ప్రత్యేకంగా కేటాయించిన సమయంలో వారంవారీగా ప్రణాళిక అమలు చేస్తారు. సోమ, మంగళవారాల్లో తెలుగు భాషపై, బుధ, గురువారాల్లో గణితంపై, శుక్ర, శనివారాల్లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ప్రతి చిన్నారీ తమ నైపుణ్యం అనుగుణంగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తారు.
చివరి దశకు చేరిన శిక్షణ
ఈ బృహత్తర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీగా ఉపాధ్యాయులకు, సీఆర్పీలకు దశలవారీగా శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లోని టీజీఐఈఆర్డీలో ఈ నెల 6, 7, 8వ తేదీల్లో, జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో మొత్తం 90 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. ఆపై 21 నుంచి 23వ తేదీ వరకు మొదటి విడతలో కొన్ని మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తికాగా.. 24 నుంచి 26వ తేదీ వరకు రెండో విడతలో మిగతా మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగతోంది.
బడి పిల్లల భవితకు
కార్యక్రమం
జిల్లాలోని ఏ ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడకూడదనేదే విద్యాశాఖ ప్రధాన లక్ష్యం. గ్రామీణ నేపథ్యాల వల్ల కొందరు విద్యార్థుల్లో వెనుకబాటుతనం కనిపిస్తోంది. దాన్ని అధిగమించేందుకే ఈ రెమిడియేషన్ విధానం. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రతి రోజూ కేటాయించిన ఒక గంట సమయంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి పంపించడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
–టి.మాధవరావు,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి


