అశ్వాపురం: మండల కేంద్రంలోని భారజల కర్మాగారం అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయమైన గౌతమీనగర్ కాలనీలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. భారజల కర్మాగారంలోని ఒడిశాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో ఏర్పడిన ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు పూజలు చేశాక గుండి చాగర్ నుంచి ఉత్కల్ పతాగర్ మండపానికి రథంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తుల జగన్నాథ నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో భారజల కర్మాగారం ఉద్యోగులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రంగు రంగుల సర్పం
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు సమీపాన అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ వింత సర్పా న్ని గుర్తించారు. భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధి పంతులు తండాకు చెందిన రైతు ఆంగోత్ సూంకల్యా పొలానికి వెళ్లగా, మధ్యాహ్నం వేళ నీటి కోసం గుట్టపై ఉన్న శ్రీసోమన్న స్వామి ఆలయం వద్ద సెల యేరుకు బయలుదేరారు. ఈ క్రమాన మార్గమధ్యలో రంగుల్లో ఉన్న పాము కనిపించగా ఫోన్ లో ఫొటో తీశారు. సుమారు రెండు అడుగుల పొడవైన ఈ పామును గతంలో ఎన్నడూ చూడలేదని సదరు రైతు వెల్లడించాడు.
ఆర్‌సీఓపై చర్యలు
తీసుకోవాలి
ఖమ్మంసహకారనగర్: జ్యోతిబాపూలే గురుకులాల ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్‌సీఓ తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ, ఉపాధ్యాయులను వేధిస్తుండడమే కాక ప్రిన్సిపాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినందున విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు బానోతు రాందాస్, ధర్మసోత్ నాగేశ్వరరావు, ఉద్దండ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఖమ్మం విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మంఅర్బన్: నగరంలోని బల్లేపల్లికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. బల్లేపల్లికి చెందిన యామ మానస (20) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ఆమె శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి స్వరూపారాణి బల్లేపల్లిలో గ్రామదీపికగా పనిచేస్తుండగా, తండ్రి ఖాసీం ఆడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మానస మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


