● నీటి ఎద్దడిని తట్టుకునే రకాల ఎంపిక మేలు ● ఖమ్మం ఇన్‌చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ
ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందుకోసం అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, తక్కువ నీటి వినియోగం, సాగు ఖర్చు తక్కువ కలిగి నీటి ఎద్దడి తట్టుకునే కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు మంచిదని జిల్లా ఇన్‌చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ వెల్లడించారు. ఎల్‌నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆమె వెల్లడించిన వివరాలు..
రైతులు తీసుకోవాల్సిన చర్యలు
వర్షాలు స్థిరంగా వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలి. తక్కువ కాలంలో పండే, కరువును తట్టుకునే పంటలు ఎంచుకోవాలి. పత్తి, మొక్కజొన్నతో పాటు కంది, పెసర, మినుము, కొర్ర, సజ్జ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. అలాగే, అంతర పంటలు సాగు చేస్తూ, కలుపు నివారణ, మల్చింగ్ ద్వారా నేల తేమను సంరక్షించాలి. వర్షపు నీటి నిల్వలకు ఫామ్ పాండ్లు తవ్వించాలి.
యాజమాన్య చర్యలు
నల్ల రేగడి నేలల్లో తేమ సంరక్షణ కోసం 120 సెం.మీ. వెడల్పుతో బోదెలు, 60 సెం.మీ. వెడల్పు, 30 సెం.మీ. లోతు కాల్వలు ఏర్పాటు చేయాలి. మధ్యస్థ లేదా తేలికపాటి నేలల్లో బోదెలు, కాల్వల పద్ధతులు అనుసరించాలి. కలుపు నియంత్రణ, నేల తేమ సంరక్షణ కోసం తరచూ అంతర దుక్కులు చేయాలి. వర్షాల సమయాన సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేయాలి. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో 2 లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 2–3 సార్లు పిచికారీ చేయాలి.
వర్షాభావంలో కూరగాయల సాగు
వర్షాభావ పరిస్థితులలో కూరగాయ పంటలు సాగుచేయడం మేలు. టమాటా, వంగ, బెండ, చిక్కుళ్లు, పాలకూర, తోటకూర, మునగ, బీర, సొర, కాకర, దోస, పచ్చి మిర్చి వంటి రకాలు ఈ పరిస్థితిని తట్టుకుంటాయి.
ఉద్యానశాఖ రాయితీలు
ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నీటిని పొదుపు చేసుకోవచ్చు. ఉద్యాన శాఖ ఎకరాకు రూ.8 వేల సబ్సిడీతో కూడిన మల్చింగ్ అందిస్తోంది. కూరగాయ పందిర్ల సాగుకు 50 శాతం రాయితీపై ఎకరానికి రూ.10 వేల వరకు అందిస్తోంది. డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. అధిక దిగుబడినిచ్చే పండ్ల తోటల రకాల విస్తీర్ణం పెంపకంలో భాగంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ లాంటి తోటలకు 40 శాతం రాయితీ కల్పిస్తోంది.


