కామేపల్లి: సైద్ధాంతిక పునాదులపై పనిచేసే కమ్యూనిస్టులే ప్రజల సంక్షేమం, హక్కుల కోసం పోరాడుతున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కామేపల్లి, కారేపల్లి మండలాల సీపీఐ సభ్యుల శిక్షణా తరగతులు శుక్రవారం ఊట్కూరులో నిర్వహించగా ఆయన మాట్లాడారు. పార్టీ సభ్యులు నిరంతరం రాజకీయ, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపట్టాలని సూచించారు. ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్న పాలకుల తీరును ఎండగట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినందున వారి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమైందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సీపీఐ జిల్లా, మండల కార్యదర్శులు దండి సురేశ్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పాపినేని సత్యనారాయణ, నాయకులు ఏపూరి లతాదేవి, ఏపూరి వెంకటేశ్వరరావు, హన్మంతరావు, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


