ఆందోళనకరమే..
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో
బొగ్గు నిల్వలు అంతంతే
సింగరేణిలో క్షీణించిన
బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం
సింగరేణి, జెన్‌కోపై
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోకస్
నెట్టుకొస్తున్నారు..
సింగరేణి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో రోజువారీ బొగ్గు ఉత్పత్తి వివరాలను పొందుపరుస్తుంది. ఆ వివరాల ప్రకారం ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సత్తుపల్లి, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం–2 ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించగా కొత్తగూడెం, ఇల్లెందు, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, అడ్రియాల, రామగుండం–1 ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో అడ్రియాల ఏరియా నిర్దేశిత లక్ష్యంలో కేవలం 15 శాతమే ఉత్పత్తి చేసింది. మొత్తంగా సింగరేణిలో 109 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైందని చెబుతున్నా.. కొన్ని ఽథర్మల్ పవర్ స్టేషన్లలో కనీస స్థాయిలోనే బొగ్గు నిల్వలు కనిపిస్తున్నాయి.
వానలు పడితే..
ఈ నెల 21 నాటి ఉత్పత్తి వివరాలను పరిశీలిస్తే రోజువారి మొత్తం లక్ష్యంలో కేవలం 75 శాతమే జరిగింది. కాగా, 21వ తేదీన గోదావరి తీర ప్రాంతంలో వర్షం కురవడంతో ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడింది. రాబోయే రెండు నెలలు వానల కారణంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. దీన్ని అధిగమిస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేయడం సింగరేణికి సవాల్‌గా మారింది.
నిల్వలు ఉండాల్సింది ఇలా..
తెలంగాణలో కేటీపీఎస్ – పాల్వంచ, బీటీపీఎస్ – మణుగూరు, కేటీపీపీ – భూపాలపల్లి, వైటీపీఎస్ – దామరచర్ల, ఎన్టీపీసీ – రామగుండం, ఎస్టీపీపీ – జైపూర్ మంచిర్యాలలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు ఉన్నాయి. ఇందులో వైటీపీఎస్ మినహయిస్తే మిగిలినవి బొగ్గు గనులు ఉన్న ప్రదేశంలో నెలకొల్పినవే. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 17 రోజులకు సరిపడా ఉండాలి. కనీసం 12 రోజులకు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా బొగ్గు గనులకు దూరంగా ఉన్న పవర్ ప్లాంట్ల విషయంలో కనీసం 20 రోజులకు సరిపడా ఉండాలి.
థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలకు సంబంధించి కోలిండియా వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రకారం కేటీపీఎస్–8 స్టేజీ, ఎన్టీపీసీలలోనే కనీస స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆఖరికి సింగ రేణి సొంత ప్లాంట్ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కేవలం ఐదు రోజులకు సరిపడా నిల్వలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పూర్తిగా సింగరేణి బొగ్గుపైనే ఆధారపడి ఉన్నాయి. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ఉపయోగించడం లేదు. దీంతో సింగరేణి నుంచి బొగ్గు రవాణా తగ్గితే ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తి, ఆపై పారిశ్రామిక, గృహ, వ్యవసాయ రంగాలపై పడుతుంది.
పవర్‌స్టేషన్ సామర్థ్యం బొగ్గు నిల్వలు ఎన్ని రోజులకు..
(మెగావాట్లు) (టన్నులు)
భద్రాద్రి 1,080 1,19,000 10
కేటీపీఎస్ (5, 6) 1,000 50,000 04
కేటీపీఎస్–7 800 1,07,000 13
కాకతీయ 1,100 7,79,000 06
ఎన్టీపీసీ, రామగుండం 4,000 4,50,000 14
యాదాద్రి 4,000 2,23,000 11
ఎస్టీపీపీ, జైపూర్ 1,200 92,000 05
ఎల్‌నినోతో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై పడింది. కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆధారమైన బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. ఆయన గురు, శుక్రవారం సింగరేణి గనులను పరిశీలించడమే కాక సింగరేణి, జెన్‌కో అధికారులతో సమీక్షించనున్నారు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


