జూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు కావాల్సిన భూసేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూలూరుపాడు మండలంలో కెనాళ్ల భూసేకరణ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. కొత్తూరు, జూలూరుపాడు గ్రామాల్లో పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసర్వే గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే, జూలూరుపాడు పరిధిలో 17.20 ఎకరాల భూమికి గాను 8 ఎకరాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములు, కొత్తూరు పరిధిలో 337 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. కాగా, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల వెడల్పును 50 నుంచి 40 మీటర్లకు తగ్గించాలని, విలువైన భూములు కోల్పోకుండా కాపాడాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. తొలుత పడమటనర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేసి వసతి, తరగతి గదులు, పారిశుద్ధ్య నిర్వహణ, పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఏజీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సుభద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలల్లో వసతుల కల్పన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన డీఎల్‌సీ సమావేశంలో ఆయన టేకులపల్లి, ములకలపల్లి, దుమ్ముగూడెం, గండుగులపల్లి, గుండాల, చర్ల, పాల్వంచ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వసతులపై ఆరా తీశాక మాట్లాడారు. విద్యార్థులకు సికిల్ సెల్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించడమే కాక ప్రతీ పాఠశాలలలో పార్ట్ టైం డాక్టర్‌ను నియమించాలని తెలిపారు. అనంతరం పాఠశాలల్లో అభివృద్ధి పనులు, తాగునీటి వసతి, బోధన, డిజిటల్ విద్య, మెనూ అమలుపై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్‌సీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
సీ్త్ర నిధి రుణాల రికవరీకి కార్యాచరణ
జిల్లాలో సీ్త్ర నిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, వచ్చే రెండు నెలల్లో 60 శాతం రికవరీ సాధించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సీ్త్ర నిధి సమీక్ష కమిటీ సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, డీఆర్‌డీఏ విద్యాచందన పాల్గొనగా కలెక్టర్ మాట్లాడారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాల ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులతో ఆరా తీశారు. జిల్లాలో సీ్త్ర నిధి రుణాల రికవరీ కేవలం 13.5 శాతంతో జిల్లా రాష్ట్రంలో 31వ స్థానాన నిలిచిందని చెప్పారు. భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో రికవరీ తక్కువగా ఉన్నందున ప్రత్యేక బృందాల ద్వారా రుణ గ్రహీతలకు అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే రెండు నెలల్లో కనీసం 60 శాతం రికవరీ సాధించేందుకు కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, డీపీఓ అనూష, అడిషనల్ డీఆర్‌డీఏ నీలేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


