పాల్వంచ/ఇల్లెందురూరల్: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపర్చుకొని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా పాఠాలు చెప్పాలని డీఈఓ వాసంతి సూచించారు. ఇల్లెందు మండలం సుభాష్‌నగర్ హైస్కూల్, పాల్వచంలోని బొల్లేరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీ టీలకు ఇస్తున్న శిక్షణను బుధవారం ఆమె పరిఈ లించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఎఫ్‌ఎల్‌ఎన్ సామర్థ్యాలను నూరు శాతం సాధించేలా కృషి చేయడమే కాక వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలని తెలిపారు. ప్రథీ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో మూడు చొప్పున జిల్లాలో 256 స్కూళ్లను ఎఫ్‌ఎల్‌ఎన్ కాంపిటేటివ్ పరిధిలోకి తెస్తున్నామని వివరించారు. ఆయా పాఠశాలలు నూరుశాతం పురోగతి సాధించేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రగతి ఆధారంగా ఏటా ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. కాగా, పాఠశాలల్లో అసౌకర్యాలను గుర్తించి విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేస్తే కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా అందిస్తాయన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మాధవరావు, ఎంఈఓలు ఏ.శ్రీరామ్మూర్తి, ఎంఈఓ ఉమాశంకర్, రిసోర్స్ పర్సన్లు రాందాస్, శ్రీను, వీరన్న, సత్తులాల్, సూర్నపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.


