పాల్వంచరూరల్: పాల్వంచ కేటీపీఎస్‌లో డీఈగా విధులు నిర్వర్తించే ఉద్యోగి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటనపై అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పాల్వంచ మండలం ఇల్లెందులపాడు తండాకు చెందిన భూక్యా మంగ్యా, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి 17వ తేదీన వీరి పెద్దకుమారుడు, డీఈ పుల్యా బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. దీంతో దంపతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారి నరేశ్ బుధవారం ఇల్లెందులపాడు తండాకు వెళ్లి వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని
కాపాడిన పోలీసులు
మహబూబాబాద్‌రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారు జామున 2.44 గంటలకు ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని డీజీ కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలికి సమాచారం అందింది. దీంతో ఆమె నైట్ పెట్రోలింగ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయగా ఎస్‌ఐ సుదర్శన్, సిబ్బంది రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఓసీ క్లబ్ సమీపాన ట్రాక్‌పై పడుకున్న యువకుడిని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. సదరు యువకుడు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన షేక్ వసీమ్‌గా గుర్తించగా.. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. దీంతో ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన సీఐ అంజలి, ఉద్యోగులను ఎస్పీ శబరీశ్ అభినందించారు.
దాడి చేసినవారిపై కేసు
భద్రాచలంఅర్బన్: కూరగాయల వ్యాపారిని అకారణంగా దూషించి, ఆయనపై దాడి చేసిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. పట్టణంలోని పాతమార్కెట్ ఏరియాలో కూరగాయల వ్యాపారం చేసే పసుపులేటి శ్రీనివాస్‌పై అక్క డే వ్యాపారం చేసుకునే వినో ద్ వచ్చి దుర్భాషలాడి దాడి చేశాడు. అనంతరం నాగేందర్ అనే వ్యక్తి వచ్చి దుర్భాషలాడి దాడికి పాల్ప డ్డాడు. ఇద్దరూ కలిసి దాడి చేయడంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. దాడి చేసిన వినోద్, నాగేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సతీశ్ తెలిపారు. కాగా, దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు వైరల్‌గా మారాయి.
బాలుడితో పనిచేయించుకుంటున్న వ్యక్తిపై..
పాల్వంచ: భవన నిర్మాణంలో బాలుడితో పనిచేయించుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బీసీఎంరోడ్‌లో ఓ భవన నిర్మాణానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో పనిచేయించుకుంటుండగా ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు పట్టుకున్నారు. పనిచేయించుకుంటున్న వెంకటేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ రామ్మూర్తి, ఏఎస్‌ఐ శాంతి, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ లలితలు పాల్గొన్నారు.


