● భోజనం చేసి వస్తానని ఆడశిశువును వదిలివెళ్లిన వ్యక్తి ● శిశు గృహలో అప్పగింత.. ఆ తర్వాత గుర్తించిన పోలీసులు
భద్రాచలంఅర్బన్: భోజనం చేసి వస్తానని చెప్పి 45 రోజుల వయస్సు కలిగిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తి భద్రాచలంలో అన్నదాన సత్రం వద్ద వృద్ధుడికి అప్పగించి వెళ్లిపోయిన వైనమిది. నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లి గ్రామానికి చెందిన ఆకుల నారాయణ బుధవారం రామాలయానికి వచ్చి దర్శనం అనంతరం అన్నదాన సత్రం వద్ద కూర్చున్నాడు. ఈ సమయాన ఎరుపు రంగు దుస్తులు ధరించిన 30 ఏళ్ల వయసు వ్యక్తి వచ్చి భోజనం చేసే వరకు పాపను పట్టుకోండని అప్పగించి వెళ్లాడు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోవడం, శిశువు ఆకలితో ఏడుస్తుండడంతో స్థానిక ఆటోడ్రైవర్ల సాయంతో శిశుగృహలో అప్పగించారు. ఈ మేరకు ఆడ శిశువును అప్పగించిన వ్యక్తి ఆచూకీ గుర్తించేందుకు ఐసీడీఎస్ అధికారులు సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తుండగా బిడ్డను వదిలివెళ్లిన వ్యక్తి భద్రాచలం చెక్‌పోస్టు వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీకి చెందిన తాను వరంగల్‌లో ఉంటున్నట్లు చెప్పాడని తెలిసింది. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో బిడ్డను వదిలివెళ్లినట్లు అంగీకరించాడని సమాచారం. ఈ నేపథ్యాన పోలీసులు పూర్తి వివరాల సేకరణలో నిమగ్నమైనట్లు తెలిసింది.


