దుమ్ముగూడెం: అక్రమంగా టాటా మ్యాజిక్ వాహనంలో తరలిస్తున్న 3 టేకు మొద్దులను స్వాధీనం చేసుకున్నట్టు రేంజర్ కమల బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా వాహనంలో ఆర్.కొత్తగూడెం సెక్షన్, బీట్ నుంచి తరలిస్తున్న 3 టేకు మొద్దులు దొరికాయి. వాటిని భద్రాచలం అటవీశాఖ కార్యాలయానికి తరలించామని, కలప విలువ సుమారు రూ.32 వేలు ఉంటుందని, వాహనాన్ని సీజ్ చేశామని రేంజర్ వివరించారు.
అధిక వడ్డీ ఆశ చూపి
పరారైన వ్యక్తి అరెస్ట్?
భద్రాచలంఅర్బన్: భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా పలు వ్యాపారాలు చేస్తూనే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు తెలిసింది. ఏపీలోని పోలవరం జిల్లా చింతూరు మండలానికి చెందిన వారి నుంచి డబ్బు సేకరించి నాలుగు, ఐదు నెలలు వడ్డీ సక్రమంగా చెల్లించినట్లు సమాచారం. దీంతో నమ్మిన ఇంకొందరు అప్పులు ఇవ్వగా.. గత నెల 27న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కానరాకుండా పోయాడు. ఈ క్రమంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణ అనంతరం మంగళవారం కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చినట్లు సమాచారం. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా భద్రాచలం సబ్ జైల్‌కు తరలించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయమై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.


