లెక్కాపత్రం లేకుండా భారీగా
ఇసుక నిల్వలు
వ్యవస్థల సహకారంతో
చెలరేగిపోతున్న మాఫియా
అశ్వారావుపేట: ఇసుక బంగారమాయెనా అన్న ట్లుగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇసుకకు డిమాండ్ పెరిగింది. దీంతో పలువురు అక్రమ మార్గాల ద్వారా తరలించి విక్రయించడాన్ని మార్గంగా చేసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతుండటంతోపాటు ప్రైవేట్ భవన నిర్మాణాలకు ఇసుక అవసరాలు పెరిగాయి. గత ప్రభుత్వం ‘మన ఇసుక’వాహనాల ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా ఇసుక సరఫరా చేసేది. ట్రాక్టర్ ఆపరేటర్లకు కూడా ఉపాధి చూపేది. కానీ, ఇప్పుడా విధానం లేక ఖరీదైన గోదావరి ఇసుక కొనలేక.. వాగు ఇసుకను తెప్పించుకోలేక వినియోగదారులు అగచాట్లు పడుతున్నారు. ఈ కొరతనే వనరుగా మార్చుకుని కొందరు ధనార్జనకు పాల్పడుతున్నారు. వాగుల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేకపోవడం, గోదావరికి ఆనుకుని ఉన్న భూభాగంలోని అధికారిక రీచ్‌ల ద్వారా ఏపీ నుంచి ఇసుకను అక్రమంగా తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.
కొన్నింటికి ఓకే..
అశ్వారావుపేటకు ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఖరీదైన భవనాలు నిర్మించేవారు గోదావరి ఇసుకే వాడతారు. ప్రభుత్వ భవనాలకు కూడా గోదావరి ఇసుక వాడాలనే నిబంధన ఉన్నా.. ఏ కాంట్రాక్టర్ కూడా గోదావరి ఇసుక వాడినట్లు సీనరేజీ క్లయిమ్ చేసుకోకపోవడం గమనార్హం. మణుగూరు, బూర్గంపాడు మండలాల నుంచి ఇసుక రాజమార్గంలో కొనుగోలు చేసినా భారం పడుతుండడంతో, ఏపీ నుంచి అక్రమంగా కొనుగోలు చేసి తెప్పిస్తున్నారని సమాచారం. అయితే, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి అక్రమంగా తరలించే లారీలను అడ్డుకుంటూ, కొవ్వూ రు ప్రాంతం నుంచి వచ్చే లారీలను వదిలేస్తుననట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దందా ఏళ్లుగా జరుగుతున్నా.. రెండేళ్లుగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా అంతర్గత పోటీతో కొన్నాళ్లు ఫిర్యాదు చేసుకున్నారని, ఇప్పుడంతా సిండికేట్ కావడంతో అక్రమాలు మరింత పెరిగాయని తెలుస్తోంది.
అడిగే వారు లేక..
అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్మించే పలు భవన నిర్మాణాలు, రహదారి కాంట్రాక్టు పనులు, 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలాల్లో భారీగా ఇసుక నిల్వ ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఇసుకను అక్రమంగా తరలించారని ‘సాక్షి’లో కథనం రావడంతో సీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇసుక గుట్టలు కనిపిస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం. రాజకీయ అండదండలు ఉన్నవారే ఇసుక మాఫియా కావడంతో అధికారులను సైతం మచ్చిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. అశ్వారావుపేటకు జీలుగుమిల్లి మీదుగా జాతీయ రహదారి, కామయ్యపాలెం నుంచి పాపిడిగూడెం రోడ్, రామన్నగూడెం మీదుగా వాగొడ్డుగూడెం రోడ్, ఊట్లపల్లి, వినాయకపురం, గాడ్రాల నుంచి దమ్మపేట మండలానికి ఇసుక అక్రమ మార్గాల్లో రవాణా అవుతోంది. గ్రామగ్రామాన సీసీ కెమెరాలు ఉన్నందున పోలీసులు అక్రమ రవాణాను అడ్డుకునే అవకాశం ఉన్నా అలా జరగకపోవడం గమనార్హం.
వ్యవస్థల సహకారంతో..
ఇసుక అక్రమ రవాణాను పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలు నియంత్రించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అడపాదడపా లారీలు, ట్రాక్టర్లు పట్టుబడడానికి మాఫియాలో విభేదాలే కారణమని తెలుస్తోంది. అంతేకాక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు కొన్ని వాహనాలను పట్టుకోవడం, తర్వాత షరా‘మామూలే’అని ప్రచారం సాగుతోంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఇసుక మాఫియా పేట్రేగిపోవడానికి రాజకీయ అండ ఉన్న వారే వ్యాపారులుగా మారడం కారణమని చెబుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఓ ముఠాకు ఉన్నా.. స్థానిక ముఠానే అధికారం చెలాయిస్తోందని సమాచారం. మండలంలోని నందిపాడు ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద ఒక హోంగార్డును కేటాయించినా మాఫియాను ఒక ఉద్యోగి నిలువరించగలరా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎస్‌ఐ యయాతిరాజును వివరణ కోరగా.. నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని, అనుమతి లేకుండా రవాణా చేసినట్లు తేలితే వాహనాలు సీజ్ చేయడమే కాక బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
కొవ్వూరు ఇసుకకే
మినహాయింపు?


