చండ్రుగొండ: పుట్టుకతోనే వైకల్యంతో జన్మించిన బాలిక జీవితాంతం అలాగే జీవనం గడుపుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే, వారి పూజలకు తోడు ‘భవిత’కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ఆమెకు నడక నేర్పింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన పసుపులేటి నాగరాజు – కృష్ణవేణి దంపతులకు 2016లో రెండో సంతానంగా సంజన జన్మించింది. నాగరాజు తాపీ కార్మికుడిగా, కృష్ణవేణి వ్యవసాయ కూలీగా పనిచేసేవాళ్లు. కానీ సంజన జన్మతహా దివ్యాంగురాలు కావడంతో తల నిలబడకపోగా, సరిగ్గా కూర్చోలేకపోయేది. దీనికి తోడు వినబడక, మాట్లాడలేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమాన తల్లి పనులు మానేసి బిడ్డ పోషణకు అంకితమైంది. ఈ క్రమాన తిప్పనపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రం ఏర్పాటుకావడంతో అక్కడ ప్రవేశం కల్పించారు. సంజన పరిస్థితిని చూసి కేంద్రంలోని ఫిజియోథెరపీ చేసే సిబ్బంది ఇంటి వద్దే చికిత్స చేస్తూ పాఠాలు బోధించారు. క్రమంగా ఆమె కోలుకుంటూ ఇప్పుడు వాకర్ లేకుండా సొంతంగా నడిచే స్థాయికి చేరింది. ఈ సంవత్సరం మూడో తరగతి చదువుతున్న సంజన పుట్టుకతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితిని చూసి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
డాక్టర్ కావడమే లక్ష్యం
ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేయడంతో పాటు ఇతర చికిత్సలతో సంజన కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలైంది. తొలినాళ్లలో వాకర్ సాయంతో నడవగా.. ఇప్పుడు సొంతంగా నడిచే స్థితికి చేరింది. ఈ సందర్భంగా సంజన భవిష్యత్‌పై ఆరా తీయగా.. తనలాంటి వారికి చికిత్స చేసేలా కష్టపడి చదివి డాక్టర్ కావడమే లక్ష్యమని వెల్లడించడం విశేషం.
తల్లిదండ్రుల సహకారం,
‘భవిత’ చికిత్సతో ఫలితం


