భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆస్థాన పురోహితుడి నియామకంలో వైదిక బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రతినిధులు మంగళవారం ఆయనను కలిసి పురోహితుడి నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భక్త రామదాసు కాలం నుంచి ఆస్థాన పురోహితుడి పదవిలో వైదిక బ్రాహ్మణులనే నియమించే ఆనవాయితీ కొనసాగుతుండగా, ఇటీవల అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చిస్తానని పేర్కొన్నారు. పురోహిత సంఘం అధ్యక్షుడు రామావజల రవికుమార్‌తో పాటు కోవూరు సుందర రామశాస్త్రి, రాయప్రోలు సత్యప్రసాద్‌శర్మ, ఆర్.వీరభద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
పాత పోడు భూముల జోలికి వెళ్లొద్దు
దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధి గద్దమడుగు గ్రామస్తులు సాగు చేసుకుంటున్న పాత పోడు భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లొదని ఎమ్మెల్యే వెంకట్రావు సూచించారు. కొన్ని రోజులుగా గద్దమడుగులో జరుగుతు న్న వివాదం నేపథ్యాన మంగళవారం ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి స్థానికులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులు గత 35 ఏళ్ల క్రితమే పోడు నరికినందున వారిని సాగుకు అనుమతించి, కొత్త పోడు కొట్టకుండా చూడాలని తెలిపారు. సర్పంచ్‌లు కోర్స దుర్గ, కల్లూరి ఆదినారా యణ, పొడియం సుబ్బారావు, కుర్సం రవి, నాయకులు ముర్రం వీరభద్రం, అన్నెం సత్యాలు, పూసం ధర్మరాజు, ఇర్ప వీర్రాజు, కొమరం బాలకృష్ణ, మడకం నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.


