విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. బీట్ ఆఫీసర్ తాత్కాలికంగా సస్పెన్షన్
వేములూరులో ఆదివాసీలు,
అటవీశాఖ మధ్య ఘర్షణ
విచారణకు మంత్రి కొండా సురేఖ,
ఉన్నతాధికారుల ఆదేశం
అశ్వాపురం: మండల పరిధిలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీలోని వేములూరు గ్రామంలో పోడు రగడ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 17న వేములూరులో ఫారెస్ట్ భూమిలో కందకాలు తవ్వేందుకు వెళ్లిన అటవీ సిబ్బంది, స్థానిక గిరిజనులకు ఘర్షణ జరిగింది. దీంతో అటవీ సిబ్బంది, గిరిజన మహిళలు గాయపడ్డారు. ఘర్షణ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలు వురు ఆదివాసీలను పరామర్శించి అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కోవడమేమిటని ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆదివాసీలే తమ విధులను ఆటంకం పరిచి, తమపై దాడులు చేశారని అటవీ అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. విచారణ జరిపి దాడి చేసిన వారిని శిక్షించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. కాగా, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
జూన్ 26న అటవీ శాఖకు,
గిరిజనులకు ఒప్పందం
జూన్ 26న వేములూరులో పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులు, స్థానిక ఆది వాసీలకు ఒప్పందం జరిగింది. సర్పంచ్ పవన్, రాజకీయ నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో పోడు భూముల విషయంపై చర్చించారు. గిరిజన ఆదివాసీలు సాగు చేసుకునే భూమి, అటవీ శాఖకు కేటాయించే భూమిపై ఇరువర్గాలు సామరస్యంగా మాట్లాడుకున్నారు. గిరిజనుల భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లకూడదని, అటవీ శాఖ భూమి జోలికి గిరిజనులు వెళ్లకూడదని హద్దులు నిర్ణయించుకుని ఒప్పందం చేసుకుని, పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.
అయినా దాడులెందుకు...
ఒప్పందం నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బంది జేసీబీతో కందకాలు తవ్వేందుకు వెళ్లగా, గిరి జనులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు వాగ్వా దం జరిగి, ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య ఒప్పందం జరిగాక దాడుల వరకు ఎందుకు వెళ్లింది? అమాయక మహిళలను రెచ్చగొట్టి దాడులకు ఊసిగొల్పారా? పథకం ప్రకారమే దాడి జరిగిందా? తదితర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియోలను అటవీ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కిన్నెరసాని ఫారెస్ట్ డివిజన్ అధికారి అధ్యక్షుడిగా, చంద్రుగొండ, యానంబైలు ఫారెస్ట్ రేంజ్ అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. మను బోతులగూడెం ఫారెస్ట్ బీట్ అధికారిని విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా సస్పెన్షన్‌లో ఉంచారు. అటవీశాఖ అధికారిని సస్పెండ్ చేయడమంటే దోషిగా నిర్ధారించినట్లు కాదని ఉన్నతాధికారులు చెబుతున్నా రు. మహిళల గౌరవానికి, భద్రతకు అటవీ శాఖ కట్టుబడి ఉందని, ఘటనకు ముందు పరిణామాలు, అధికారుల విధులకు కలిగిన ఆటంకాలు, తొలుత వారిపై దాడి తదితరాలను పరిశీలించాలని పేర్కొంటున్నారు. అన్ని ఆధారాలను అధికారులు విచారణ కమిటీకి అందజేయాలని, దోషులని తేలితే చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


