కొన్ని పాఠశాలల్లో సిగ్నల్ సమస్యతో నమోదుకాని హాజరు
మరికొన్ని పాఠశాలల్లో నమోదులో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
ఇటీవల తనిఖీల్లో గుర్తించిన డీఈఓ హెచ్చరిక నోటీసులు జారీ
సకాలంలో హాజరు వివరాలు ఎంఈఓ, డీఈఓ ఆఫీస్‌లకు చేరనివైనం
ఎఫ్‌ఆర్‌ఎస్‌లో జాప్యం చేయొద్దు
కొత్తగూడెంఅర్బన్: జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో సిగ్నల్ సమస్య వెంటాడుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరునమోదుకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని పాఠశాలల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మరికొన్ని పాఠశాలల్లో సిగ్నల్ ఉన్నా ఉపాధ్యాయులు సకాలంలో హాజరు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా, పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్(ముఖ గుర్తింపు పద్ధతి) ద్వారా యాప్‌లో అప్‌లోడ్ చేసినా సిగ్నల్ లేక నమోదు కావడంలేదు. ఉపాధ్యాయులు సాయంత్రం ఇళ్లకు వెళ్లాక హాజరు శాతం డీఈఓ కార్యాలయానికి చేరుతోంది. ఇటీవల డీఈఓ ఏజెన్సీ మండలాలల్లోని కొన్ని పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులు రాని పాఠశాలలు, హాజరు నమోదు చేయని పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించి హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. అయితే ఇంటర్‌నెట్ సమస్య వల్ల హాజరు నమోదులో సమస్యలు వస్తున్నాయని, ఇందుకు ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
నెట్ సిగ్నల్ రాని ప్రాంతాలు ఇలా...
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 1,070 ఉన్నాయి. ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రైమరీ పాఠశాలలకు ట్యాబ్‌లు, ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం సిమ్‌లను అందజేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ట్యాబ్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో కూడా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ట్యాబ్‌లు, సెల్‌ఫోన్ల యాప్‌లో హాజరు నమోదు చేసుకుని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు అప్‌లోడ్ చేయాలి. వారు ఎంఈఓలకు పంపిస్తే, అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి హాజరు వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఇదంతా ఉదయం 10.30 గంటలలోగా పూర్తికావాలి. అప్పుడే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ రోజు ఎంత మంది హాజరయ్యారనేది వెల్లడవుతుంది. గుండాల, దుమ్ముగూడెం, కరకగూడెం, అశ్వారావుపేట, చర్ల తదితర మండలాల్లో సిగ్నల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో సకాలంలో హాజరు నమోదు, అప్‌లోడ్ కావడంలేదు. దీంతో కొందరు ఉపాధ్యాయులు సాయంత్రం ఇళ్లకు వెళ్లాక హాజరు వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఫలితంగా రోజూ 80 శాతం, అంతకంటే తక్కువగా హాజరు నమోదు కనిపిస్తోందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
నిర్లక్ష్యం వీడని కొందరు ఉపాధ్యాయులు
జిల్లాకు గతేడాది నుంచి రెగ్యులర్ డీఈఓ లేరు. ఇటీవలే రెగ్యులర్ డీఈఓ నియమితులయ్యారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొత్త డీఈఓ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాక కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. విద్యాశాఖ అధికారులు మరింత దృష్టి సారించి హాజరు నమోదు చేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కొన్ని పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదుకు ఇంటర్‌నెట్ సిగ్నల్ సమస్య ఎదురవుతోంది. అయి తే సిగ్నల్ సమస్య లేని పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాంటి వారికి నోటీసులు జారీ చేశాం. ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నిర్లక్ష్యం వహించొద్దు.
–డి.వాసంతి,
జిల్లా విద్యాశాఖాధికారి


