భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం: ఆలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆదివారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఊట్ల గ్రీష్మణ్ శ్రీరామ్ రూ. 50 వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఆలయ సిబ్బంది రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరికి నదీ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజ, 108 ప్రమిదల దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం సీతారాములకు 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతులు సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురోహితులు రామవజ్జల రవికుమార్, పవన్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.


