భద్రాచలంటౌన్: కోయ–గోండి భాషకు అధికారిక గుర్తింపు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ కమిటీ చైర్మన్ ఫగ్గన్‌సింగ్ కులస్తేకు ఆదివాసీ సంఘాలు వినతిపత్రం సమర్పించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్పూర్‌లో జరుగుతున్న 11వ జాతీయ కోయ–గోండి భాషా ప్రామాణికరణ వర్క్‌షాప్ రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, భద్రాచలం పట్టణానికి చెందిన జాతీయ సమన్వయకర్త మడివి నెహ్రూ నేతృత్వంలో ఆదివాసీ భాషల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి ఐటీడీఏలో స్థానిక భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. దీనిపై ఫగ్గన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ.. కోయ–గోండి భాషా గుర్తింపు అంశాన్ని ఇప్పటికే లోక్‌సభలో ప్రస్తావించానని, ఈ విషయాన్ని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఉపాధ్యాయులు పీసొడి కన్నయ్య, పాయం వెంకటరత్నం, ఇర్ప రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉప సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా చావల
చుంచుపల్లి: రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా చావల పురుషోత్తం ఎన్నికయ్యారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామపంచాయతీ ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ఫోరం సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. లోతువాగు గ్రామ ఉపసర్పంచ్ యాకుబ్‌పాషాను లక్ష్మీదేవిపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నియమించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఈ మేరకు నియామక పత్రాలు అందజేశారు. ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌నాయక్, ఉపసర్పంచులు వెంకట నరసయ్య, రాజు పాల్గొన్నారు.


