హలధారికి కన్నీటి ధారలు | - | Sakshi
Sakshi News home page

హలధారికి కన్నీటి ధారలు

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

కొనుగోలు కేంద్రాల నుంచి మక్కల తరలింపులో వీడని నిర్లక్ష్యం

ఇల్లెందు మండలంలో 75,610 క్వింటాళ్లు ఇంకా కేంద్రాల్లోనే నిల్వ

అకాల వర్షాలతో మొక్కజొన్న, ధాన్యం రైతులకు తప్పని తిప్పలు

ఇల్లెందురూరల్‌: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు చేర్చి నెలలు గడుస్తున్నా కాంటా పెట్టి రవాణా చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. రెండు రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కల్లాల్లో నిల్వ ఉన్న మక్కలు మరోసారి తడిస్తే పనికిరాకుండా పోతాయని ఆవేదన చెందుతున్నారు.

42 శాతం నిల్వలు కేంద్రాల్లోనే..

మండలంలో ప్రస్తుత యాసంగిలో 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఎకరాకు 40 క్వింటాళ్ల చొప్పున 26వేల ఎకరాలకు 10.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 26 క్వింటాళ్ల చొప్పున ఇల్లెందు మండలంలో 6.76 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 1,79,093 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 4.96 లక్షల క్వింటాళ్లతోపాటు అదనంగా పండిన 3.64 క్వింటాళ్లు మొత్తంగా 8.60 లక్షల క్వింటాళ్లను రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ఇక కొనుగోలు చేసిన 1.79 లక్షల క్వింటాళ్లలో ఇప్పటివరకు కేవలం 1.03 లక్షల క్వింటాళ్ల మాత్రమే గోదాంలకు తరలించారు. ఇంకా 75,610 క్వింటాళ్లు కేంద్రాల్లో నిల్వ ఉన్నాయి. ఇది కొనుగోలు కేంద్రాలకు చేరిన మొక్కజొన్నలో 42 శాతంగా ఉంది.

ప్రైవేటుకు చేరుతున్న ధాన్యం

మండలంలో తక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేసినా పండిన పంటను తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టి విక్రయానికి రైతులు సిద్ధం చేశారు. తీరా కాంటా సమయంలో ధాన్యం నాణ్యతగా లేదని పేర్కొంటూ 50 కిలోల బస్తా తూకం చేపిస్తే అధికారులు మాత్రం 8 కిలోలు తగ్గించి 42 కిలోలుగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని, ఇలా క్వింటాకు 16 కిలోలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని అధికారులు గోదాములకు తరలించకపోవడంతో రేపల్లెవాడ కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఐదుగురు రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు.

వెంటాడుతున్న వర్షభయం

రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు గురువారం తెల్లవారు జామున, సాయంత్రం చినుకులు పడ్డాయి. రాత్రి ఉరుములు, మెరుపులతో కమ్ముకున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి గోదాంలకు రవాణా చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement