మారనున్న దక్షిణ అయోధ్య రూపురేఖలు
ఈనెల 26న ‘కళావాహన’ పూజలు
హాజరుకానున్న చినజీయర్ స్వామి
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం రూపురేఖలు మారిపోయి సరికొత్త కళ రానుంది. ఆలయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం నడుం బిగించడంతో పాటు నిధులను కేటాయించడంతో పనుల ప్రణాళికల రూపకల్పనలో వేగం పెరిగింది. ఇప్పటికే స్థపతి సత్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ అధికారులు, వైదిక పెద్దల సలహాలు, సూచనలతో రూపొందించిన ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాక మార్చి 2027 నాటికి మొదటి విడత పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉండగా.. ఆలయ పరిసర ప్రాంతాల్లో హడావుడి మొదలైంది.
ముహూర్తం ఖరారు
భక్త రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం మినహా ఇతర నిర్మాణాలన్నీ తొలగించి సరికొత్త రూపు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, ఆళ్వార్‌లను కదిలించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 26న కళావాహనతో స్వామి వార్లను కలశాలలోకి ఆవాహన చేస్తారు. అనంతరం 72 మంది మూలమూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించే బాలాలయానికి తరలిస్తారు. తిరిగి పునఃప్రతిష్ఠ చేసే వరకు అక్కడే ఉంచి నివేదన, ఆరాధన జరపనున్నారు. ఈనెల 26న జరిగే పూజలకు చినజీయర్ స్వామి హాజరు కానుండగా.. దేవస్థాన అధికారులు, వైదిక పెద్దలు ప్రణాళికలు ఖరారులో నిమగ్నమయ్యారు. ఇక లక్ష్మీతాయారు అమ్మవారు, గోదాదేవి మూలమూర్తులను ప్రధాన ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలోకి చేర్చి నిత్య పూజలు నిర్వహిస్తారు. అయితే, ప్రధాన ఆళ్వార్లు, పంచలోహ విగ్రహాలను మాత్రం ఇక్కడే ఉంచనున్నారు.
అమ్మవారి ఉపాలయంపై అస్పష్టత
ప్రభుత్వం ఆమోదించిన నూతన మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తుతం తొలగించనున్న లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయానికి ఇతర స్థలంలో చోటు కల్పించారు. అయితే ఇటీవల చినజీయర్ సలహాతో వైదిక పెద్దలు ప్రస్తుతం ఉన్న చోటే అమ్మవారి ఆలయం కొనసాగించాలనే ప్రతిపాదన తీసుకొచ్చి నట్లుగా సమాచారం. ఈ అంశంపై రెండు రోజుల్లో వైదిక పెద్దలు, అధికారుల సమాలోచనల తర్వాత స్పష్టత రానుంది. ఇక చిత్రకూట మండపంతో పాటు చుట్టుపక్కల నిర్మాణాలను కూడా తొలగించనున్నారు. చిత్రకూట మండపంలోని రాతి రాళ్లను భద్రపర్చనుండగా.. ఆగ్నేయంలో తిరిగి అదే తరహాలో నిర్మాణం చేపడుతారు. కాగా, లడ్డూ విక్రయాల కౌంటర్లను ఏడాది పాటు తాత్కాలికంగా ఏర్పాటుచేయాల్సి ఉండగా స్థలాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక నిర్మాణాల తొలగింపునకు టెండర్లు ఆహ్వానించారు.
అభివృద్ధిలో భాగంగా ప్రధాన ఆలయం మినహా సమూల మార్పులు
‘ప్రసాద్’ భవనం పూర్తయి ఉంటే...
‘ప్రసాద్’ పథకం ద్వారా మంజూరైన నిధులతో జీ ప్లస్ టూ భవన నిర్మాణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అయితే, ఈ భవనం అనుకున్న సమయానికి పూర్తయితే ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడేదని చెబుతున్నారు. జీ ప్లస్ భవనంలోనే డార్మెటరీ హాళ్లు, నిత్యాన్నదానానికి హాల్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయి ఉంటే లడ్డూ కౌంటర్లతో పాటుగా కార్యనిర్వహణ గదులు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడేది. కానీ కాంట్రాక్టర్‌కు నాలుగు దఫాలు గడువు పొడిగించినా పూర్తిచేయకపోవడం గమనార్హం. కనీసం పుష్కరాల సమయానికైనా అందుబాటులోకి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర టూరిజం అధికారులు పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు.


