భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామి వారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎంకు వినతి
మణుగూరు రూరల్: ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సారథ్యాన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం హైదరాబాద్‌లో సీఎంకు వినతిపత్రం అందజేశారు. పోడుభూములకు పట్టాలు, సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు చెక్‌డ్యామ్‌లతో పాటు రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు, బోర్లు తవ్వేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. అలాగే, ఐటీడీఏల బలోపేతం, ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంపుపై విన్నవించగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యే పాయం తెలిపారు. ఆయన వెంట ఖానాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జ, డాక్టర్ మురళీనాయక్ పాల్గొన్నారు.
నేడు డిప్యూటీ సీఎం,
మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరు మండలం నారాయణపురంలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక, కల్లూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత పెనుబల్లి మండలంలో పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. అంతేకాక పెనుబల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశాక మధ్యాహ్నం సత్తుపల్లిలో వంద పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించి అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం రేజర్లలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత 3–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి సందర్శిస్తారు. అక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
నేటి నుంచి
‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు
ఖమ్మంసహకారనగర్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ‘దోస్త్’ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించగా, బుధవారం నుంచి మొదటి విడుత రిజిస్ష్రేన్లు మొదలుకానున్నాయి. ఈమేరకు డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ ద్వారా మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరు ఈనెల 30నుంచి వచ్చే మే 8వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు ఇస్తే, మే 14వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 15నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విడతలో మే 15నుంచి 26వ తేదీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశముండగా మే 30న సీట్లు కేటాయిస్తారు. అలాగే, మూడో విడత రిజిస్ట్రేషన్లు మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉంటాయని, మే 21నుంచి జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇస్తే జూన్ 20వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.


