ప్రకృతి అందాలకు నెలవుగా
పులిగుండాల
పక్షి వీక్షణం, పెడల్ బోటింగ్,
సఫారీతో ఎకో టూరిజం
నేడు ప్రారంభించనున్న
డిప్యూటీ సీఎం, మంత్రి
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో సహజ సౌందర్యం కలిగిన పులిగుండాలలో పర్యాటకులకు కొత్త అందాలు అందుబాలోకి వచ్చాయి. తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ 35,637 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఇక్కడి రిజర్వాయర్ ప్రకృతి ప్రేమికులకు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈమేరకు ప్రాజెక్టును పర్యావరణ హిత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. స్థానికులకు ఉపాధి లభించేలా వన్యప్రాణి, జీవావరణ పరిరక్షణ, పక్షి వీక్షణ, ట్రెక్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించడంతో మరింత అందాన్ని సంతరించుకుంది.
పర్యాటకులకు సౌకర్యాలు
పులిగుండాల ఎకో–టూరిజం ప్రాంత వీక్షణకు వచ్చే పర్యాటకుల కోసం వసతులు సమకూర్చారు. పులిగుండాల ప్రాజెక్టులో పెడల్ బోటింగ్ సౌకర్యం కల్పించగా.. తాత్కాలిక వసతి సౌకర్యం, పక్షి వీక్షణ టవర్లు, వ్యూ పాయింట్లు, సఫారీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
27 కి.మీల జంగిల్ సఫారీ
పులిగుండాల పర్యాటక ప్రాంతంలో 27 కి.మీ. జంగిల్ సఫారీ ప్రత్యేకంగా నిలవనుంది. ఇది పులిగుండాల మినీ జలపాతం, చిరుత వీక్షణ టవర్‌ను అనుసంధానం చేస్తుంది. ఈ మార్గం ద్వారా సందర్శకులు కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని కిన్నెరసాని, భద్రాచలం ప్రాంతంతో పాటు పులిగుండాల కూడా పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందనుంది. ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యాన రూపొందించిన ప్రాజెక్టును ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి బుధవారం ప్రారంభించనున్నారని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు.


