ధాన్యం ఆరబోసి పడిగాపులు కాస్తున్న అన్నదాతలు
జిల్లాలో ఇంకా మొదలుకాని కొనుగోళ్లు
మిల్లుల కేటాయింపు పూర్తికాకపోవడంతోనే ఆలస్యం
బూర్గంపాడు: యాసంగిలో సాగుచేసిన వరి కోతలు ఊపందుకోగా, ధాన్యం రైతుల చేతికందుతోంది. దీంతో కల్లాల్లో ఆరబోస్తున్న అన్నదాతలు అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్న ప్రాంతాల్లో ఆరబోసిన వారు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికార యంత్రాంగం హడావుడి చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లుల కేటాయింపులు జరగలేదని, త్వరలోనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. దీంతో చేసేదేం లేక పలువురు రైతులు దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.
95వేల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది యాసంగిలో జిల్లా రైతులు సుమారు 95వేల ఎకరాలలో వరి సాగు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 168 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా 83,650 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెబుతున్నా.. ఎక్కడా గింజ కూడా కొనుగోలు చేసిన దాఖలు లేవు. అయితే, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు మిల్లుల కేటాయింపు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. కాగా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చాక కూడా మీనమేషాలు లెక్కించడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డురకమే ఎక్కువ...
జిల్లాలో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు దొడ్డు రకాలే సాగు చేశారు. గత యాసంగి సీజన్‌లో సన్నరకం సాగు చేస్తే దిగుబడులు రాకపోగా.. ప్రభుత్వం ఇస్తామని రూ.500 బోనస్ కూడా చెల్లించలేదు. దీంతో రైతులు దొడ్డు రకాలకే మొగ్గుచూపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఫలితంగా చాలా కేంద్రాలు నిండిపోయాయి. మిగతా కోతలు కూడా పూర్తయి రైతులు ధాన్యం తీసుకొస్తే కుప్ప పోసే పరిస్థితులు కూడా లేవు.
వాతావరణ మార్పులతో ఆందోళన
ఇటీవల జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగలంతా తీవ్రమైన ఎండ ఉంటున్నా సాయంత్రం మబ్బు చేసి అక్కడకక్కడా జల్లులు పడుతున్నాయి. దీంతో కేంద్రాల్లో పగలంతా ధాన్యం ఆరబోస్తున్న రైతులు, సాయంత్రకల్లా కుప్ప చేసి టార్పాలిన్లు కప్పి కాపలా కాయాల్సి వస్తోంది. మధ్యాహ్నం గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ధాన్యంలో సరిపడా తేమ వచ్చినందున అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


