● జయంతి వేడుకల్లో కలెక్టర్ అంకిత్ ● హాజరైన ఎస్పీ రోహిత్‌రాజ్, అధికారులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి పాల్గొన్న కలెక్టర్.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. రాజ్యాంగం రూపకల్పనలో అంబేడ్కర్ చేసిన చేసిన కృషి అపూర్వమని తెలిపారు. ఆయన దూరదృష్టితోనే దేశాభివృద్ధికి పునాదులు పడ్డాయని చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశమైనా అంతా ఐక్యంగా నిలబడటానికి రాజ్యాంగమే కారణమని తెలిపారు.
వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ, ప్రతిజ్ఞ
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ‘అరైవ్–అలైవ్’లో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, డీటీఓ వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, కమిషనర్ సుజాత, ఉత్సవ కమిటీ సభ్యులు ఆంతోటి పాల్, డాక్టర్ మద్దెల శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, సబ్బారపు మధుసూదన్ రావు, పీక కృష్ణ, కోలపూరి ధర్మరాజు, సలింగటి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.


