ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

అంగన్‌వాడీల ఆధ్వర్యంలో

23 వరకు ‘పోషణ్‌ పక్వాడ’

గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ

పౌష్టికాహారం అందించేలా అడుగులు

చిన్నారుల పై ప్రత్యేక దృష్టి..

భద్రాచలంఅర్బన్‌: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపం నివా రణ, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహనకు పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళ, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభం కాగా.. ఈ నెల 23 వరకు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నా రు. ఆరేళ్ల చిన్నారుల్లో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించి, తీసుకోవా ల్సిన ఆహారం, ఆవశ్యకతను వివరించనున్నారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ప్రత్యేక కార్యక్రమాలు

పోషణ్‌ పక్వాడాలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రసవానంతరం వీలైనంత త్వరగా పిల్లలకు తల్లిపాలు మొదటి ఆరు నెలలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలు వివరించి.. తల్లి పాలు మాత్రమే ఇచ్చేలా చూస్తారు. అమ్మమ్మ, నానమ్మ మాటల్లో పోషణ కథలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చెప్పడం, గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పోషకాహా రం ప్రాముఖ్యత వివరిస్తారు. స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు ఉపయోగించి పలు రకాల ఆహార వంటకాలు, తల్లిదండ్రులకు వంటల పోటీ లు నిర్వహిస్తారు. జంక్‌, ప్యాకేజ్డ్‌ ఆహారాల వల్ల కలిగే హాని, పోషకాహారంపై ర్యాలీల నిర్వహణ, పిల్లల అభివృద్ధి మైలురాళ్లను గుర్తించడం, బాల్య ఆరంభ దశ సంరక్షణ, విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. చిన్నారులకు స్థానిక జానపద కళల ప్రదర్శనలు, పజిల్స్‌, నాటకీకరణ పోటీలు, శారీరక కండరాల అభివృద్ధికి ప్రోత్సాహం, రచన పోటీలు నిర్వహిస్తారు.

లోపాలు ఉన్న వారిపై దృష్టి

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను సేకరించగా.. కొందరిలో వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం గుర్తించారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టిసారించి తల్లిదండ్రులకు పోషకాహారంపై అవ గాహన కల్పించి లోపాలను అధిగమించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, బాలామృతం, బాలామృతం ప్లస్‌ పంపిణీ చేస్తారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లి పాలు ఇచ్చే పద్ధతులు, రక్తహీనత, పర్యావరణ, వ్యక్తిగత పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ వివరిస్తారు. ఉడికించిన కోడి గుడ్లు, మురుకులు, పండ్లు, ఆకుకూరల ప్రదర్శన, చేతులను పరిశుభ్రంగా కడుక్కునే విధానం వివరిస్తారు.

దుమ్ముగూడెం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నాం. చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అంగన్‌ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పౌష్టికాహారంపై వివరిస్తాం.

–జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement