● కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది ● జెండా మోసిన వారికి సముచిత గౌరవం ● డీసీసీ ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, మంత్రి పొంగులేటి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం / ఖమ్మం మయూరిసెంటర్: పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా జెండా వీడని కార్యకర్తలు కాంగ్రెస్‌కు ఖమ్మంను కంచుకోటగా నిలబెట్టారని, భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తొలుత భారీ ర్యాలీగా జడ్పీసెంటర్‌కు చేరుకుని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నూతన కార్యవర్గంతో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ ప్రమాణం చేయించాక డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో పదవులు పొందడం అదష్టమని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ విషయమై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాగా, కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలను తప్పక గుర్తిస్తామని.. ఇదే సమయాన ఉదాసీనంగా ఉండేవారిని పార్టీ గమనిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.
కార్యకర్తలే పార్టీకి ప్రాణం
టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్‌కు ప్రాణమని తెలిపారు. పదవి చిన్నదా, పెద్దదా అని కాకుండా పనే ముఖ్యమని చెప్పారు. తొలిమెట్టు రాజకీయ ప్రస్థానానికి ఆరంభంగా నిలుస్తుందని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెడితే ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఎంతో శ్రమిస్తూ సంక్షేమ పథకాలను ఆపకుండా నడుపుతున్నారని చెప్పారు. కేటీఆర్ విదేశాలు తిరిగినా పెట్టుబడులు రాకపోగా, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రూ.5.78 లక్షల కోట్ల మేర వచ్చాయని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ వందకు పైగా సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం..
తెలంగాణ ప్రభుత్వం పేదల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలు చేరుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రభుత్వం కార్యకర్తల కష్టార్జితమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈమేరకు కొత్త కార్యవర్గం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, అంబేద్కర్ జయంతిని సందర్భంగా అంబేద్కర్ భవనంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయగా.. పారిశుద్ధ్య కార్మికులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, రాగమయి భోజనం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు బేబి స్వర్ణకుమారి, ముస్తఫా, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


