ఐటీడీఏ పీఓ రాహుల్
భధ్రాచలం: రాజ్యాంగ ఫలాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరూ ఎదిగేలా కృషి చేసిన అంబేడ్కర్ ఆశయ సాధనకు సమష్టిగా కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ చేరువ చేసిన మహనీయుడని కొనియాడారు. ఏపీఓ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, అధికారులు గన్యానాయక్, వేణు, సమ్మయ్య, రమేశ్, సైదులు, సున్నం రాంబాబు, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని కంపగూడెం క్రాస్ రోడ్డు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు మంగళవారం సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గడ్డి మందు తాగి
ఆత్మహత్య
ముదిగొండ: కడుపునొప్పి తాళలేక గడ్డి మందు తాగి న యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముదిగొండ మండలం ముత్తారానికి చెందిన తాళ్ల సందీప్ (22) బ్యాటరీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కడుపునొప్పి భరించలేక ఈ నెల 12న గడ్డిమందు తాగగా, కుటుంబీకులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించగా, మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో ఆయన నేత్రాలను నేత్రనిధికి అందజేశారు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బ లక్షణాలతో మహిళ మృతి
కొణిజర్ల: వడదెబ్బ లక్షణాలతో బాధపడుతూ మహిళ మృతి చెందింది. మండలంలోని తనికెళ్లకు చెందిన ముత్యాల సత్యావతి(55) మిర్చి ఏరే పనులకు వెళ్తోంది. ఈ క్రమాన రెండు రోజుల క్రితం అనారో గ్యం బారిన పడగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోంది. మంగళవారం ఉదయం కుప్పకూలిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వడదెబ్బతోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.


