ప్రీ హాస్పిటల్ సేవలు..
‘టెరి’తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో
అత్యవసర సేవలు
రామవరంలో తుది దశకు
చేరుకున్న ఏర్పాటు పనులు
హార్ట్, ట్రామా విభాగాల్లో
అందనున్న మెరుగైన వైద్యం
అంబులెన్సులు, ఆస్పత్రుల్లో
ఆధునిక వైద్య పరికరాలు
అందుబాటులోకి
వైద్య సేవలపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భరోసా కల్పించే పరిస్థితి లేదు. మెరుగైన, అధునాత వైద్యం కోసం ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అక్కడికి తరలించేలోగా విలువైన సమయం వృథా అవుతోంది. ఫలితంగా క్షతగాత్రులు, గుండెపోటు బాధితుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే, త్వరలో ఈ తరహా సమస్యలకు జిల్లాలోనే పరిష్కారం లభించనుంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
2023లో మంజూరు
అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇన్సియేషన్ (టెరి) పేరుతో సరికొత్త కార్యక్రమం అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రులు, జాతీయ రహదారులపై ప్రతీ 40 కి.మీ లకు ఒకటి వంతున అత్యవసర వైద్యసేవల విభా గాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వాస్పత్రులను ఎంపిక చేసింది. ఇందులో జిల్లా ఆస్పత్రులు 21, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు 17, ఏరియా ఆస్పత్రులు 16 వరకు ఉన్నాయి. అయితే, కొత్తగూడెం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్లడంతోపాటు బోధనా ఆస్పత్రి కూడా ఉంది. దీంతో ఇక్కడ 50 పడకల సామర్థ్యంతో అత్యవసర సేవలు (ట్రామా కేర్) అందించే ఆస్పత్రి 2023లో మంజూరైంది.
రామవరంలో ఆస్పత్రి
వంద పడకల సామర్థ్యంతో 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో ఏరియా ఆస్పత్రి నిర్మించారు. మెడికల్ కాలేజీ వచ్చాక పడకల సామర్థ్యం 230కి పెరిగింది. రామవరంలో సువిశాలమైన క్యాంపస్‌లో ఉన్న మాతా శిశు ఆస్పత్రిని సైతం మెడికల్ కాలేజీ అనుబంధంగా మార్చారు. వైద్య కళాశాలకు అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న సర్వజన ఆస్పత్రి ప్రాంగణం ఇప్పటికే ఇరుకుగా మారింది. దీంతో ట్రామా కేర్ సెంటర్‌ను రామవరంలో ఉన్న మాతాశిశు ఆస్పత్రి ప్రాంగణంలో స్థలం కేటాయించారు. దాదాపుగా రెండేళ్లుగా భవన నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. సివిల్ వర్క్స్ పూర్తికాగా, మెడికల్ ఎక్వీప్‌మెంట్‌ను అమర్చాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసి ట్రామా కేర్ సేవలు అందుబాటులోకి తేవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
అత్యవసర వైద్య సేవలను రెండు రకాలుగా విభజించారు. మొదటిదైన ప్రీ హాస్పిటల్‌లో భాగంగా ప్రమాదాల్లో గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తీసుకువచ్చేలోగా అవసరమైన పరీక్షలు, వైద్య సాయం అందిస్తారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న 108 అంబులెన్సులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సదరు టెక్నీషియన్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వివరాలను 108లో ఉన్న పరికరాల ద్వారా ఆన్‌లైన్‌లో వైద్యులకు చేరవేస్తారు. తద్వారా అంబులెన్స్ ఆస్పత్రికి వచ్చేలోగా సదరు గాయపడిన వ్యక్తికి అవసరమైన వైద్య పరీక్షలు దానికి అవసరమైన పరికరాలతో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా సిద్ధం చేస్తారు. రెండోదైన ఎమర్జెన్సీ విభాగంలో ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్‌రే, సెక్షన్ ఆపరేటర్లు, డిఫిబ్రిలేటర్లు, సీ ఆర్క్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్‌మెంట్‌లు సమకూర్చుతారు. గుండె, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, మాతాశిశు తదితర విభాగాల్లో అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా పారామెడికల్, నర్సింగ్, స్పెషలిస్టు వైద్యులను కేటాయిస్తారు.


