తక్షణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణ చర్యలు చేపట్టాలి

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశాలు

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, కొత్తగూడెం ఆర్డీఓ మధు, గృహనిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరి ష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమస్యలపై చర్చించి, పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని, ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో

కొన్ని ఇలా..

● రేషన్‌ కోసం ప్రతి నెలా 4.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని, తమ గ్రామంలో రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలని టేకులపల్లి మండలం కొత్త తండా గ్రామ పంచాయతీకి చెందిన ప్రజలు విన్నవించారు.

● సర్వే నంబర్‌ 817/36లో భూమి ఉండగా, భూభారతి ఆన్‌లైన్‌లో నిషేధిత భూమిగా చూపిస్తున్నారని పాల్వంచ గాంధీనగర్‌కు చెందిన మంగళగిరి నాగమ్మ ఫిర్యాదు చేసింది.

● త్రిచక్రవాహనం మంజూరు చేయాలని భద్రాచలం రాజుపేటకు చెందిన, 80 శాతం దివ్యాంగునిగా ఉన్న శివకుమార్‌ వినతిపత్రం ఇచ్చాడు.

● 70 శాతం అంగవైక్యలం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్‌ ఉన్నా దివ్యాంగుల పింఛన్‌ మంజూరుల చేయాలని ఇల్లెందు ఎల్బీఎస్‌ నగర్‌కు చెందిన తాటి లాలయ్య విన్నవించాడు.

● కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎస్టీ కుల ధ్రువీకరణ పొందుతున్నారని, దీనివల్ల నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని చర్ల మండలం ఆనంద కాలనీకి చెందిన ప్రజలు విన్నవించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement